»All Set To Jupally Krishna Rao To Join In Congress Party
Jupally బీజేపీని కాదని కాంగ్రెస్ వైపే అడుగు.. సొంతగూటికి మాజీ మంత్రి జూపల్లి
ఈటల రాజేందర్ తో చేసిన చర్చల్లో స్పష్టమైన హామీలు రాకపోవడం, జిల్లాలో బీజేపీకి బలం లేకపోవడం వంటి కారణాల రీత్యా కమల దళంలోకి వెళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బలంగా ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (AP)లోనూ.. స్వరాష్ట్రం తెలంగాణలోనూ (Telangana) మంత్రిగా సేవలందించిన నాయకుడు.. ఉమ్మడి మహబూబ్ నగర్ (MahabubNagar) జిల్లా ముఖ్య నాయకుడుగా ఉన్న జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) రాజకీయ భవిష్యత్ నడి రోడ్డుపై ఉన్నట్టు ఉంది. బీఆర్ఎస్ (BRS Party) నుంచి బహిష్కరణకు గురయి దాదాపు నాలుగు నెలలైనా ఇప్పటివరకు తన తదుపరి కార్యాచరణ ప్రకటించలేకపోతున్నారు. బీజేపీలో చేరుదామంటే లెక్కలు తేలడం లేదు. తన ఉనికి ప్రశ్నార్థకమవుతుందని భావించి తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ (Congress Party)లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ జీవితం ప్రారంభించిన జూపల్లి మళ్లీ హస్తం పార్టీలోనే చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Eatala Rajender)తో చేసిన చర్చల్లో స్పష్టమైన హామీలు రాకపోవడం, జిల్లాలో బీజేపీకి బలం లేకపోవడం వంటి కారణాల రీత్యా కమల దళంలోకి వెళ్లేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. పొంగులేటి ఏ పార్టీలోకి చేరినా కూడా తాను మాత్రంలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ బలంగా ఉంది.
కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పటిష్టంగా ఉంది. 2018 ఎన్నికల్లో తన ప్రత్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి (Beeram Harshavardhan Reddy) కాంగ్రెస్ నుంచి గెలుపొందడమే ఉదాహరణ. తన అనుచర వర్గంతోపాటు కాంగ్రెస్ కేడర్ (Cadre)తో కలిస్తే వచ్చే ఎన్నికల్లో తన గెలుపు నల్లేరుపై నడకగా జూపల్లి భావిస్తున్నారు. వీలైనంత త్వరగా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. తన అనుచర వర్గం కూడా బీజేపీ వద్దని.. కాంగ్రెస్ లో చేరాలని కోరుతున్నారు. ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జూపల్లి చేరికకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా జూపల్లిని ఆహ్వానించిన విషయం తెలిసిందే. అన్ని కుదిరితే జూన్ 8వ తేదీన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
బ్యాంక్ ఉద్యోగం వదిలేసి జూపల్లి కృష్ణారావు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా కొనసాగారు. 2011 అక్టోబర్ లో అప్పటి టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ (KCR) మంత్రివర్గంలో కూడా మంత్రిగా చేశారు. అయితే అనూహ్యంగా 2018 ఎన్నికల్లో ఓటమిపాలవడంతో బీఆర్ఎస్ లో అతడి ప్రాధాన్యం లేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో సస్పెండ్ (Suspend)కు గురయ్యారు.