Jupally Krishna Rao: కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు..KCR మాటలు నమ్మోద్దు
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ దోపిడీ పాలనకు అడ్డు అదుపు లేకుండా తయారైందని ఆరోపించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్లికార్జున్ ఖర్గే కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. దీంతోపాటు సీనియర్ నేత గురునాథ్ రెడ్డి, జీవన్, నిజామాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ నాగారాజు, మెగారెడ్డి సహా పలువురు పార్టీలో చేరారు. BRS పార్టీని వదలి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నేపథ్యంలో తనకు చాలా సంతోషంగా ఉందని జూపల్లి అన్నారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలన చూసిన తర్వాత చాలా బాధ వేసిందన్నారు. కానీ కేసీఆర్ దుర్మార్గమైన ఫాసిస్టు పాలనతో ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ఇప్పటికీ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అగ్రస్థానంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే దేశంలో అన్ని పార్టీలకు పెట్టుబడి తానే పెడతానని కేసీఆర్ ప్రకటించాడు. అంటే ఎంత అవినీతి సొమ్ము కేసీఆర్ దగ్గర ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ సహా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇవి మాములు చేరికలు కాదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 69 వేల కోట్ల అప్పులున్న రాష్ట్రం..ప్రస్తుతం 7 లక్షల 50 వేల కోట్లకు చేరిందని రేవంత్ గుర్తు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని ప్రకటించగానే బయపడి కేసీఆర్ రుణమాఫీ ఇస్తామని ప్రకటించారని రేవంత్ అన్నారు. కానీ కేసీఆర్ మాటలు నమ్మితే ఇక అంతేనని తెలిపారు. ప్రజల్లో మార్పు రావాలని కేసీఆర్ మాయమాటలు నమ్మోద్దని కోరారు.