»Neelam Madhu Who Joined Bsp Will Filed Nomination
BSP:లో చేరి నీలం మధు నామినేషన్..మరి గెలుస్తాడా?
తెలంగాణలో పటాన్ చెరు కాంగ్రెస్ టిక్కెట్ గురించి చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి రాజకీయాలు రచ్చకెక్కాయి. ఇక్కడి స్థానిక నేత నీలం మధు టిక్కెట్ ఆశించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. కానీ కాంగ్రెస్ మొదట పేరు ప్రకటించి చివరి జాబితాలో పేరు లేకపోవడంతో తాజాగా మధు బీఎస్పీ పార్టీలో చేరారు.
ఇటివల బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పటాన్ చెరు(patancheru) నేత నీలంమధు(Neelam Madhu) ముదిరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన పార్టీని వీడి బహుజన్ సమాజ్ పార్టీ (BSP)లో చేరారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ అభ్యర్థిగా ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నీలం మధు మొదట బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. టికెట్ కోసం పార్టీలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి BRS టిక్కెట్టు కేటాయించింది. దీంతో అసంతృప్తి చెందిన నీలం మధు పార్టీని వీడారు. కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్ హామీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ నుంచి హామీ లభించడంతో కొద్దిరోజుల క్రితం ఆ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు టిక్కెట్టు ఇచ్చి మళ్లీ పెండింగ్‌లో పెట్టినట్లు ప్రకటించింది.
పటాన్‌చెరుకు చెందిన కాంగ్రెస్(congress) నేత టికెట్ ఆశించిన వ్యక్తి కాటా శ్రీనివాస్ నీలం మధుకు టికెట్ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన కొత్త వ్యక్తికే టికెట్ ఖరారు చేయాలని పార్టీ నేతలు విమర్శించారు. ఆ క్రమంలో గాంధీభవన్ వద్ద శ్రీనివాస్ అనుచరులు నిరసనకు దిగారు. ఈ పరిస్థితుల్లో నీలం మధుకు కాంగ్రెస్ బీఫారం రాలేదు. ఆ తర్వాత గురువారం రాత్రి ప్రకటించిన జాబితాలో నీలం మధు స్థానంలో పటాన్చెరు టికెట్ శ్రీనివాస్‌కు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
దీంతో కాంగ్రెస్ నేతలు తనను మోసం చేశారని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కాంగ్రెస్‌ను ఓడించాలని అనుచరులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం పటాన్చెరు బీజేపీ(BJP) అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్.. నీలం మధును తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కానీ మధు అందుకు నిరాకరించి చివరకు బీఎస్పీలో చేరారు. దీంతో ఆ పార్టీ ఆయనకు బీఫామ్ ఇచ్చింది.