ఖమ్మం జిల్లా(Khammam District) చింతకాని మండలంలో విచిత్ర సంఘటన జరిగింది. తుమ్మాడనే కారణంతో ఓ వ్యక్తిని ఘోరంగా కొట్టారు కొందరు వ్యక్తులు. ఈ సంగతి ఇప్పుడు పోలీస్ స్టేషన్కు చేరింది. చింతకాని (Cintakani mandal) మండలం పందిళ్లపల్లికి చెందిన బొందెల సత్యనారాయణ (Bondela Satyanarayana) కుటుంబ సభ్యులు ఈనెల 13వ తేదీన ఓ శుభకార్యానికి బయలుదేరారు. అయితే, అదే వీధిలో ఉంటున్న పప్పుల వీరభద్రం తన ఇంట్లోనే కూర్చుని ఉన్నాడు. తుమ్ములు రావడంతో తుమ్మాడు. అయితే, అతను తుమ్మిన సమయంలోనే సత్యనారాయణ కారు ఇంటి ముందుకు వచ్చింది. దాంతో వీరభద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు సత్యనారాయణ.
తాము కారులో వెళుతుండగా అపశకునంగా తుమ్మావని వీరభద్రాన్ని, సత్యనారాయణ కుటుంబీకులు అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారంపై గ్రామంలో ఈనెల 15న పంచాయితీ (Panchayat) నిర్వహించారు. ఈ సమయంలోనే సత్యనారాయణ కుటుంబీకులు ఒక్కసారిగా వీరభద్రంపై దాడిచేసి పొట్టు పొట్టుగా కొట్టారు. వీరభద్రం పోలీస్ స్టేషన్లో(police station) ఫిర్యాదు చేయడంతో సత్యనారాయణతో పాటు అతని భార్య, ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, తుమ్మాడనే కారణంతో వ్యక్తిపై దాడి చేయడం ఇప్పుడు ఖమ్మంలో వైరల్గా మారింది.