Pro Kabaddi 2023: తొలి మ్యాచ్‌లో ఓడిన జైపూర్ జట్టు
ప్రో కబడ్డీ పదో సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సీజన్లో 5వ మ్యాచ్ జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ 9వ సీజన్ విజేత పుణేరి పల్టాన్ మధ్య జరిగింది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచారో తెలుసుకుందాం.
Pro Kabaddi 2023: ప్రో కబడ్డీ మ్యాచ్‌లు ఉత్కంఠంగా సాగుతున్నాయి. ఈ సీజన్లో 5వ మ్యాచ్ జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ 9వ సీజన్ విజేత పుణేరి పల్టాన్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో పూణే జట్టు 37-33తో అద్భుత విజయాన్ని సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన జైపూర్ జట్టు మాత్రం తన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ తరపున అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 17 పాయింట్లు సాధించగా.. పుణేరి పల్టాన్ తరపున అస్లాం ఇనామ్దార్ అత్యధికంగా 10 రైడ్ పాయింట్లు సాధించాడు. డిఫెన్స్‌లో మహ్మద్రెజా షాడ్లు 4 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రాహుల చౌదరి కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించి అందరినీ నిరాశపరిచాడు.
అర్థభాగం ముగిసేసరికి పుణేరి పల్టాన్‌పై జైపూర్ పింక్ పాంథర్స్ 18-14తో ఆధిక్యంలో ఉంది. పుణేరి పల్టాన్ ఆరంభంలో ఆధిక్యం కనబరిచింది. అయిన పూణే డిఫెండర్లు ఇద్దరూ ఔట్ అయ్యారు. ఇలా ఆ జట్టు మొదటిసారిగా ఆలౌట్ అయ్యింది. జైపూర్ తరపున అర్జున్ తొలి అర్ధభాగంలో అత్యధికంగా 8 పాయింట్లు సాధించగా, పుణేరి పల్టాన్ తరపున మోహిత్ గోయత్ గరిష్టంగా 4 పాయింట్లు సాధించాడు. ద్వితీయార్థంలో అర్జున్ దేశ్వాల్ సూపర్ 10ని మల్టీ-పాయింట్ రైడ్‌తో పూర్తి చేయగా జట్టు స్కోర్ కూడా పెరిగింది.
పుణేరి పల్టాన్ కూడా అద్భుతంగా ఆడి జైపూర్ స్కోర్‌కు దగ్గరగా వచ్చింది. చివరికి అర్జున్ ఔట్ కావడంతో వెంటనే జైపూర్ తొలిసారిగా ఆలౌట్ అయ్యింది. ఇరు జట్ల మధ్య తేడా కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉంది. చివరి నిమిషంలో ఇరు జట్ల మధ్య స్కోరు సమానం కావడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. చివరికి జైపూర్ పింక్ పాంథర్స్ రెండోసారి ఆలౌట్ కావడంతో పూణె ఆధిక్యంగా 6 పాయింట్లు వచ్చాయి. అస్లాం కూడా వెంటనే తన సూపర్ 10ని పూర్తి చేయగా పల్టాన్ మ్యాచ్‌ను గెలుచుకుంది. జైపూర్ ఓటమి పాలయ్యింది.