»Tennis Player Sumit Naagal Sensatyional Victory In Australian Open 2024
Tennis Player Sumit Naagal : సుమీత్ నాగల్ సంచలన విజయం.. ఒక్క గెలుపుతో మారిన జాతకం
భారత్ టెన్నీస్ ఆటగాడు సుమీత్ నాగల్ దశ తిరిగింది. ఒకే ఒక్క విజయంతో ఈ ఆటగాడు కోటీశ్వరుడయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న ఆటగాడిని ఓడించడంతో సుమీత్ నాగల్ జాక్‌పాట్ కొట్టాడు.
భారత్ టెన్నీస్ ఆటగాడు సుమీత్ నాగల్ రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో సంచలన విజయం సాధించాడు. తన కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న ఆటగాడిని వరుస సెట్లలో ఓడించాడు. ఈ విజయం పట్ల దేశ వ్యాప్తంగా ఉన్న టెన్నీస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమీత్ నాగల్ సాధించిన ఈ విజయం వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి.
2023లో సుమీత్ నాగల్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆర్ధికంగా అండదండలు అందించేవారు లేకపోవడంతో సరైన ట్రైనింగ్ తీసుకోలేకపోయాడు. డబ్బులు లేని కారణంగా ఓ కోచ్‌గానీ, ఫిజియోగానీ లేకుండానే అనేక టోర్నమెంట్లలో పాల్గొనేవాడు. తన ఆర్ధిక ఇబ్బందుల గురించి ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించాడు. తన బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం 80 వేలు మాత్రమేనని సుమీత్ వెల్లడించాడు. మహారాష్ట్ర టెన్నీస్ ఫౌండేషన్‌కు చెందిన ప్రశాంత్ సుతార్ తనకు కాస్త సాయం చేస్తున్నారని తెలిపాడు. అదే విధంగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ నుంచి తనకు జీతం వస్తోందని …ఇవి తప్ప తనకు పెద్దగా ఆర్ధిక అండదండలు అందించేవారు ఎవరూ లేరని సుమీత్ వెల్లడించాడు. జర్మనీలో ప్రఖ్యాత టెన్నీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందాలని భావిస్తున్నట్లు సుమీత్ తన కోరికను బహిర్గతం చేశాడు.
80 వేల నుంచి కోటి రూపాయలకు చేరిన బ్యాంక్ బ్యాలెన్స్
ఇంటర్వూలో వెల్లడించిన అంశాలు కొందరి హృదయాలను తాకాయి. దీంతో ఈ యువకుడికి ఆర్ధిక సాయం అందించేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. పెప్సీకో ఇండియా కంపెనీ, ఢిల్లీ ల్యాన్ టెన్నీస్ అసోసియేషన్లు సుమీత్కు అండగా నిలిచాయి. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్‌కు సన్నద్ధం కాగలిగాడు. కజకిస్తాన్ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్‌ను ఓడించి సంచలన సృష్టించాడు. అలెగ్జాండర్ బబ్లిక్ ప్రస్తుతం టెన్నీస్ ర్యాంకింగ్స్ లో 27వ స్థానంలో ఉన్నాడు. అటువంటి గొప్ప ఆటగాడిని అన్ సీడెడ్ ఆటగాడైన సుమీత్ నాగల్ ఓడించడం…భారత టెన్నీస్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అలెగ్జాండర్ బబ్లిక్ పై 6-4, 6-2, 7-6 తేడాతో విజయం సాధించాడు సుమీత్. తొలి రౌండ్లో విజయం సాధించి రెండో రౌండ్లో ప్రవేశించాడు.
గత ఏడాది 24 మ్యాచులు ఆడిన సుమీత్ నాగల్ 65 లక్షలు సంపాదించాడు. యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగినప్పటికీ 18 లక్షలు అందుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలి రౌండ్లో బబ్లిక్‌పై విజయం సాధించడం ద్వారా దాదాపుగా కోటి రూపాయలు దక్కించుకున్నాడు. ఒక్కసారిగా టెన్నీస్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.