యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ అన్నకు తగ్గ తమ్ముడని అనిపించుకున్నాడు. వాంఖడే స్టేడియంలో విజృంభించాడు. 136 పరుగులు చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.
Mushir Khan: ముంబై(Mumbai)లోని వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారింది. ఓ 19 ఏళ్ల కుర్రాడు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. సెంచరీతో కదం తొక్కాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) రికార్డు కూడా బ్రేక్ చేశాడు. టీమిండియా నయా సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) సోదరుడు ముషీర్ ఖాన్(Mushir Khan) అన్నకు తగ్గ తమ్ముడని అనిపించుకున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఫైనల్ అడుతున్న ముషీర్.. తన జట్టుకు ప్రధాన ఆటగాడిగా మారాడు. ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. విదర్భ జట్టు బౌలర్లను ఉతిరి ఆరేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 136 పరుగులు చేశాడు. జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు కారకుడయ్యాడు. అజింక్యా రహానే నేతృత్వంలోని ముంబై జట్టు విదర్భ జట్టు ముందు 538 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
ముంబై తరపున రంజీ ట్రోఫీ ఆడుతూ ఫైనల్లో సెంచరీ చేయడం ద్వారా ముషీర్ ఖాన్ సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. 1994లో ముంబై తరపున రంజీ ఫైనల్లో సెంచరీ చేసే నాటికి సచిన్ వయస్సు 21 సంవత్సరాలు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ జట్టుపై సచిన్ 140 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆ రికార్డ్ బ్రేక్ అయింది. 19 ఏళ్ల వయసులోనే ముషీర్ ఖాన్ రంజీ ఫైనల్లో సెంచరీ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ ఫైనల్లో … ముంబై జట్టు పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఈ క్రమంలో రంగంలో దిగిన ముషీర్ ఖాన్ ఎంతో సంయమనంతో ఆడాడు. రహానేతో కలిసి మూడో వికెట్‌కు 73 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అదే విధంగా శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి 95 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 224 పరుగులు చేయగా, విదర్భ 105 పరుగులు చేసింది. 119 పరుగుల ఆధిక్యంతో 2వ ఇన్నింగ్స్ ఆడిన ముంబై జట్టు 130.2 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌటైంది. తద్వారా విదర్భ జట్టుకు 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ముంబై జట్టులో ముషీర్ ఖాన్ 136 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు బాదాడు. 19 ఏళ్ల ముషీర్ ఖాన్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి రంజీ క్రికెట్ ఫైనల్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన ముంబై ప్లేయర్‌గా అవతరించాడు. ముషీర్ బ్యాటింగ్ తీరుకు ముచ్చట పడిన సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా ద్వారా తన సంతోషం వ్యక్తం చేశాడు. ముషీర్ ఖాన్‌ను ఉద్దేశించి పులి ఆకలితో ఉందని ట్వీట్ చేశాడు. మరోవైపు సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. మున్నా బడా ప్యారాహై అనే కిషోర్ కుమార్ పాటను జత చేశాడు.