ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టికెట్ల పంచాయితీ తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీకి పాకింది. టికెట్ల కోసం ఓ ఎమ్మెల్యే ఏకంగా ప్రభుత్వానికి విన్నవించాడు. టికెట్లు (Match Tickets) ఇవ్వాలని సభలో కోరాడు. దీనికి మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) గట్టి కౌంటర్ ఇచ్చారు. టికెట్లు ఇచ్చేది ఎవరయ్యా.. మీ స్నేహితుడే కాదా వారిని అడగండి అంటూ తెలిపాడు. దీంతో అసెంబ్లీలో సీఎం స్టాలిన్ (MK Stalin), స్పీకర్ తో సహా సభ్యులంతా గొల్లున నవ్వారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం అసెంబ్లీలో మాజీ మంత్రి, అన్నాడీఎంకే (AIADMK) విప్ ఎస్పీ వేలుమణి (SP Velumani) ఐపీఎల్ టికెట్ల ప్రస్తావన తీసుకొచ్చారు. చెన్నైలో (Chennai) జరిగే మ్యాచ్ ల టికెట్లు ఎమ్మెల్యేలకు అందించాలని కోరాడు. గతంలో పళనిస్వామి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చేదని తెలిపారు. అదే మాదిరి ఈ సంవత్సరం ప్రభుత్వం టికెట్లు కొని ఎమ్మెల్యేందరికీ ఇవ్వాలని విన్నవించాడు.
దీనికి స్పందించిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘నాలుగేళ్లుగా చెన్నైలో మ్యాచ్ లే జరగలేదు. మరి టికెట్లు కొని ఎవరికి ఇచ్చారు?’ అని ప్రశ్నించాడు. ‘అయినా ఐపీఎల్ నిర్వహించేది ఎవరు బీసీసీఐ కదా. దాని చైర్మన్ ఎవరూ మీకు మిత్రుడైన అమిత్ షా కుమారుడు జైషానే. మేము అడిగితే టికెట్లు మాకు ఇవ్వరు. మీరు అడిగితే ఇస్తారు’ అని అన్నాడీఎంకేకు ఉదయనిధి స్టాలిన్ చురకలు అంటించారు. దీంతో సభలోని సభ్యులంతా నవ్వారు. ఐపీఎల్ లో తమిళనాడు తరఫున చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) బరిలో ఉన్న విషయం తెలిసిందే. ధోనీ సారథ్యంలో చెన్నై ఉండడంతో తమిళ ప్రజలు మ్యాచ్ లపై అమిత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సీఎస్కే (CSK) మ్యాచ్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో అదే అంశం అసెంబ్లీలో ప్రస్తావనకు రావడం గమనార్హం.
“IPL is managed by BCCI. Jay Shah, son of your close friend Amit Shah, is the head of BCCI. If we ask (for tickets) they won’t listen to us. But if you ask them, they will listen.”