అధికార పార్టీ బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi- BRS Party)లో అసంతృప్తులు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లో కార్పొరేటర్, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. అదే రోజు నిర్మల్ జిల్లాలో (Nirmal District) మరో గొడవ జరిగింది. ఎమ్మెల్యే సర్పంచ్ తో గొడవకు దిగారు. ఒక దశలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. చిన్న విషయంలో జరిగిన వివాదం ఖానాపూర్ నియోజకవర్గంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఖానాపూర్ (Khanapur) బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ (Ajmeera Rekha Naik). నియోజకవర్గంలో ఆమె విస్తృత పర్యటన చేస్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కడెంతోపాటు (Kadem) కన్నాపూర్ గ్రామ పంచాయతీలో మంగళవారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వరుణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రేఖా నాయక్ హాజరయ్యారు.
సమావేశంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ మాట్లాడుతూ కన్నాపూర్ సర్పంచ్ నరేందర్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు. ప్రసంగం కొనసాగిస్తుండగా నా పేరు ఎక్కడా అని సర్పంచ్ నరేందర్ రెడ్డి ప్రశ్నించాడు. ‘నా ఊరికి వచ్చి నా పేరు ప్రస్తావించకుండా ఎలా మాట్లాడుతున్నావ్’ అని ఎమ్మెల్యేను నిలదీశాడు. ఈ పరిణామంతో ఆవేశానికి లోనైన ఎమ్మెల్యే రేఖా నాయక్ ‘నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యేను. నీ పేరు చెప్పకపోవచ్చు. అయితే ఏంది? నేను ఎస్టీ మహిళ అనే రెచ్చిపోతున్నావ్ కదా. రేపు నీ సంగతి చూస్తా’ అని ఎమ్మెల్యే సర్పంచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నవారు కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కానీ ఎమ్మెల్యే తీరుపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు.