»Telangana Minister Harish Rao Suggest To Ap People Apply As Telangana Voters
తెలంగాణ ఓటర్లుగా మారండి: AP ప్రజలకు మంత్రి Harish Rao పిలుపు
ఏపీలో రోడ్లు, ఆస్పత్రులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణకు ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది. మరి ఇక్కడ ఉంటారా? అక్కడ ఉంటారా? మీకు ఇక్కడే మంచిగా ఉంది కాదా?’
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh People) ప్రజల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao)పై చెరగని అభిమానం ఉంది. అందుకే కేసీఆర్ (KCR) జన్మదినం సందర్భంగా ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించుకుంటారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పెట్టడంతో ఏపీ ప్రజలు ఆదరిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను ఏపీలోకి స్వాగతిస్తున్నారు. తాజాగా విశాఖ ఉక్కు ప్లాంట్ పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ఏపీలో కేసీఆర్ పై చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో ఏం సక్రమంగా లేవు.. తెలంగాణలోకి వచ్చేయండి. తెలంగాణ ఓటర్లుగా మారండి’ అంటూ హరీశ్ రావు పిలుపునిచ్చారు.
సంగారెడ్డిలో (SangaReddy) భవన నిర్మాణ కార్మికుల (Construction Workers) కార్యకలాపాల కోసం భవనం నిర్మించుకుంటున్నారు. ఆ భవన నిర్మాణ పనుల భూమిపూజకు మంగళవారం మంత్రి హరీశ్ రావు హాజరై పూలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘తెలంగాణ అభివృద్ధిలో (Telangana Development) భాగస్వాములై చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని కేసీఆర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన భవన నిర్మాణ కార్మికులు తెలంగాణలో ఓటర్లుగా నమోదు చేసుకోవాలి’ అని సూచించారు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్ కార్మికులను కడుపులో పెట్టి చూసుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏపీలో పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో రోడ్లు, ఆస్పత్రులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో తెలంగాణకు ఏపీకి చాలా వ్యత్యాసం ఉంది. మరి ఇక్కడ ఉంటారా? అక్కడ ఉంటారా? మీకు ఇక్కడే మంచిగా ఉంది కాదా?’ అని ప్రశ్నించగా.. భవన నిర్మాణ కార్మికులు అందరూ అవును సార్ అని బదులిచ్చారు. ‘ఇంకేముంది ఏపీలో ఓట్లు తీసేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోండి’ అని మరోమారు సూచించారు.
కార్మికులకు మే డే రోజున సీఎం కేసీఆర్ శుభవార్త వినిపిస్తారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఎకరా విస్తీర్ణంలో రూ.2 కోట్ల వ్యయంతో కార్మిక భవనాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మే డే రోజున వాటికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు భవన నిర్మాణ కార్మిక మండలిలో సభ్యత్వం తీసుకోవాలని మంత్రి సూచించారు.