రెండు రాష్ట్రాల యువ నాయకులు ఒక చోటకు చేరారు. వారిద్దరూ గతంలో విదేశాల్లో కలిసిన వారు తాజాగా హైదరాబాద్ (Hyderabad)లో కలుసుకున్నారు. వారిద్దరే తెలంగాణ మంత్రి కేటీఆర్ (KT Rama Rao), మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన పార్టీ యువ నాయకుడు ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray). వీరిద్దరూ హైదరాబాద్ లోని టీ హబ్ (T Hub)లో సమావేశమయ్యారు. టీ హబ్ విశేషాలను తెలుసుకుని ఆదిత్య ఆశ్చర్యపోయారు. అనంతరం కేటీఆర్ తో సమావేశమై పలు విషయాలపై మాట్లాడుకున్నారు.
స్టార్టప్స్ అడ్డాగా వెలుగొందుతున్న టీహబ్ ను ఆదిత్య ఠాక్రే మంగళవారం సందర్శించారు. ఆదిత్యను కేటీఆర్ స్వాగతించి టీ హబ్ ప్రాముఖ్యం, ఘనతలు, సాధించిన అవార్డులను వివరించారు. అనంతరం వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీపై ఆదిత్య ఠాక్రే ట్విటర్ (Twitter)లో స్పందించారు. ‘టీ హబ్ ను సందర్శించాను. అద్భుతమైన స్టార్టప్స్, ఇన్నోవేటర్లు, కొత్త ఆలోచనలకు టీ హబ్ కేంద్రంగా నిలుస్తోంది. కేటీఆర్ తో ప్రతి సమావేశం అద్భుతంగా ఉంటుంది. మా ఇద్దరి ఒకే లక్ష్యాలైన పట్టణీకరణ, సుస్థిరత, సాంకేతిక పరిజ్ణానం భారతదేశ అభివృద్ధికి ఊతం ఇస్తుంది’ అని ఆదిత్య ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ కు కేటీఆర్ (KTR) ప్రతిస్పందించాడు. ‘దావోస్ పర్యటన తర్వాత మరోసారి ఆదిత్యతో సమావేశం కావడం ఆనందంగా ఉంది. భవిష్యత్ లో మరిన్ని సమావేశాలు ఉంటాయని ఆశిస్తున్నా’ అని కేటీఆర్ పోస్టు చేశారు. కేటీఆర్ ను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు దావోస్ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఆదిత్య ఠాక్రే కలిశారు. కాగా మహారాష్ట్రలోని శివసేన పార్టీతో బీఆర్ఎస్ పార్టీకి సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రేతో ముంబైలో సీఎం కేసీఆర్ కలిసిన విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ (KCR)ను ఆహ్వానించిన వారిలో ఉద్దవ్ ఠాక్రే ఒకరు. ఆయన కుమారుడే ఉద్దవ్ ఠాక్రే. ఇప్పుడు ఈ యువ నాయకులు సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. భవిష్యత్ లో మహారాష్ట్రలో బీఆర్ఎస్, శివసేన కలిసే అవకాశాలు ఉన్నాయి.