Dharmapuri తాళం చెవుల పంచాయితీ.. మంత్రికి పొంచి ఉన్న గండం
తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు.
తెలంగాణలో తాళం పంచాయితీ ఉత్కంఠ రేపుతున్నది. ఆ తాళాలు దొరికితే ఓ మంత్రి పదవికే గండం పొంచి ఉంది. అందుకే ఆ తాళాలు లభించలేదు. ఈ తాళాల పంచాయతీ హైకోర్టుకు చేరింది. కలెక్టర్ దగ్గర ఉండాల్సిన తాళాలు మాయం కావడం రాజకీయంగా వివాదం రేపుతున్నది. ఈ పరిణామాలన్నీ జగిత్యాల జిల్లాలో (Jagtial District) ఉత్కంఠ పరిణామాలు జరుగుతున్నాయి. తాళాలు మాయం కావడం కీలక మలుపు తిరిగింది.
2018 శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం (Dharmapuri Constituency) నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar), బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) పోటీ చేశారు. ఓట్ల ఫలితాలు ఉత్కంఠ రేపాయి. ఆఖరికి 441 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఈశ్వర్ గెలిచారు. అయితే ఈ ఫలితాలను సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఈవీఎం (EVM)లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ (Strong room) ను తెరిచి అందులోని డాక్యుమెంట్స్ ను నిర్ణీత తేదీలోగా తమకు అందించాలని హైకోర్టు కలెక్టర్, ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈవీఎం (Electronic Voting Machine -EVM)లను భద్రపరిచిన వీఆర్కే ఇంజినీరింగ్ కాలేజీలోని (VRK Engineering College) స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు అభ్యర్థి లక్ష్మణ్ తో పాటు కలెక్టర్ యాస్మిన్ భాషా అధికార యంత్రాంగంతో వచ్చారు. మూడు గదుల్లో రెండో గది తాళం తెరచుకోవడంతో అందులో పత్రాలు పరిశీలించి వీడియో తీశారు. ఇక మిగతా రెండు గదుల తాళాలు కనిపించలేదు. ఆ తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు. తాళాలు తెరచుకోలేని విషయాన్ని కోర్టుకు విన్నవిస్తామని కలెక్టర్ తెలిపారు. కాగా ఈ తాళాలు తెరచుకోకపోవడంపై లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు.
ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్ తాళాలను కుట్ర ప్రకారమే తీయలేదని లక్ష్మణ్ ఆరోపించాడు. కలెక్టర్ లేదా, అదనపు కలెక్టర్ వద్ద ఉండాల్సిన తాళం చెవులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కోర్టు ఆదేశించి ఆరు రోజులు గడిచినా అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.. ప్రభుత్వం ఒత్తిడి మేరకే అధికారులు అలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై న్యాయస్థానంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.