తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో (Kodi Kathi Case) వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణకు రావాలని ఎన్ఐఏ కోర్టు (NIA Court) ఆదేశాలు ఇవ్వగా సోమవారం ఆ కేసు విచారణ జరుగుతోంది. దీనిపై జగన్ ప్రతి పిటిషన్ (Petition) దాఖలు చేశారు. ‘విచారణకు నేను రాలేను. నేను వస్తే ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది’ అని జగన్ పిటిషన్ లో పేర్కొన్నాడు.
విశాఖపట్టణం (Visakhapatnam) విమానాశ్రయంలో లాంజ్ లో 2018 అక్టోబర్ లో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి జరిగింది. ఆ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటన ఒక విధంగా జగన్ అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేసింది. అయితే కోడికత్తి కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఈ కేసు విచారణకు రాగా.. సీఎం జగన్ రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని సీఎం కోరారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దరఖాస్తు చేశారు.
‘రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్నాయి. కోర్టుకు సీఎం హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. అడ్వకేట్ కమిషన్ ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలి’ అని పిటిషన్ లో జగన్ అభ్యర్థించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని సీఎం మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈనెల 13వ తేదీన విచారణ చేస్తామని ఎన్ఐఏ కోర్టు తెలిపింది.