వ్యక్తిగత పర్యటన కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) విదేశాలకు వెళ్లనున్నాడని సమాచారం. వారం రోజుల పాటు కుటుంబంతో (Family) కలిసి జాలీగా గడిపేందుకు వెళ్తున్నారని తెలిసింది. వేసవి సమయంలో (Summer) విదేశాలకు కుటుంబంతో సహా వెళ్లేందుకు జగన్ ప్లాన్ చేసుకుంటాడు. గతంలో ఇలాగే రెండు, మూడుసార్లు వెళ్లిన విషయం తెలిసిందే. గతంలో పారిస్, డెట్రాయిట్, దావోస్, డల్లాస్ పర్యటనకు వెళ్లారు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారనే సమాచారం మాత్రం తెలియరాలేదు.
రాజకీయాల్లో బిజీగా ఉండే జగన్ వ్యక్తిగత విషయాలకు (Personal) కూడా ప్రాధాన్యం ఇస్తారు. నాడు తండ్రి వైఎస్సార్ (YSR) కూడా కుటుంబ సమేతంగా కొన్ని రోజులు వ్యక్తిగత పర్యటన చేపట్టేవారు. జగన్ కూడా అదే మాదిరి పర్యటనకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో ఒక సంవత్సరం పాటు రాజకీయంగా ఫుల్ బిజీ అయ్యే అవకాశం ఉంది. ఇక కుటుంబంతో ఎక్కువ సేపు గడిపే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత పర్యటనకు జగన్ చేపట్టాలని భావిస్తున్నాడు. ఈ పర్యటనతో కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందులో భాగంగానే తన భార్య భారతి, కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డితో కలిసి సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన చేపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 21వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్తున్నారని అనే వార్త బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ఇంకా తాడేపల్లి నివాసం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఏపీలో ‘మా నమ్మకం నువ్వే’ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇంటింటికి తిరిగి జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్ ను అంటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక 175కి 175 స్థానాలు అంటూ తీరని కోరికతో ఎన్నికలకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నాడు. ఎన్నికల కోసం ఏడాదిన్నర ముందు నుంచే జగన్ ప్రణాళికలు వేస్తున్నాడు. ఇదే క్రమంలో పాలనను పక్కన పెట్టేసి రాజకీయం చేస్తున్నారు. నిత్యం సర్వేలు, ప్రచారం, వ్యూహాలపై సమీక్ష చేస్తున్నారు.