»Man Returns Home 13 Days After Family Performed His Last Rites In Madhya Pradesh
MP : చనిపోయాడనుకుని అంత్యక్రియలు… తర్వాత ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి!
చనిపోయాడనుకుని ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిందో కుటుంబం. ఆ తర్వాత పెద్ద కర్మకు ముందు రోజు ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుందాం రండి.
Man returns home after last rites : తమ ఇంట్లోని వ్యక్తి కొన్ని రోజులుగా జాడ తెలియకుండా పోయాడు. సడన్గా ఒకసారి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. అతడిని తమ సురేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. దీంతో అతడు చనిపోయినట్లుగా కుటుంబం(Family) భావించి అంత్యక్రియలు(Last Rites) నిర్వహించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడి లహచోరా గ్రామ వాసి అయిన సురేంద్ర రాజస్థాన్లోని జై పూర్లో ఓ దుస్తుల ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు.
కట్ చేస్తే సురేంద్రకు పెద్ద కర్మ చేయడానికి కుటుంబం సిద్ధమవుతోంది. అంత్యక్రియలు నిర్వహించిన సరిగ్గా 13 రోజుల తర్వాత ఇంటికి ఓ ఫోన్ వచ్చింది. తాను సురేంద్రను అని, ఫోన్ పోయిందంటూ అతడు చెప్పుకొచ్చాడు. దీంతో ఏం జరిగిందో అర్థం కాక కుటుంబ సభ్యులు తెల్లబోయారు. అతని తమ్ముడు వీడియో కాల్ చేసి నిర్ధారించుకున్నాడు. దీంతో అతడిని ఇంటికి రావాలని వారు చెప్పారు. జరపాల్సిన పెద్ద కర్మను కూడా వాయిదా వేసుకున్నారు.
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన ఫోన్ పాడైందని, అందుకే ఇంటికి ఫోన్ చేయలేకపోయానని సురేంద్ర కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో అతడు రెండు నెలలుగా కుటుంబానికి ఫోన్ చేయలేదు తప్ప బతికే ఉన్నాడని వారికి అర్థం అయింది. అయితే ఆ కుటుంబ సభ్యులు సురేంద్ర అని తప్పుగా గుర్తించిన మృత దేహం ఎవరిదా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో బాగా గాయపడి ఉండటంతో అతడిని గుర్తించడంలో వారు పొరబడ్డారని పోలీసులు తిరిగి కేసు రాసుకుని దర్యాప్తు చేస్తున్నారు.