రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏదో ఒక సీటును వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన కేరళలోని వయనాడ్‌ను వదులుకుని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Rahul Gandhi Lok Sabha Seat : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(RAHUL GANDHI) లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి, ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నుంచి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో ఈ రెండు స్థానాల నుంచి ఆయన ఎంపీగా(MP) గెలుపొందారు. దీంతో ఆయన ఇప్పుడు ఏదో ఒక సీటును వదులుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటి వరకు డైలమో కొనసాగుతూ ఉంది. రాహుల్ ఏ సీటును ఎంచుకుంటారా? అని అంతా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే రాహుల్ గాంధీ సైతం ఈ విషయంలో ఇప్పటి వరకు నానుస్తూ వచ్చారు. చివరికి యూపీలోని రాయ్‌బరేలీకే జై కొట్టారు. వయనాడ్ సీటును వదులుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ విషయమై కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుధాకరన్(Sudhakaran) సూచన ప్రాయంగా వ్యాఖ్యలు చేశారు. తన మద్దతుదారులు, తన కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్ గాంధీ కేరళలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో సుధాకరన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
సుధాకరన్ సభలో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ(RAHUL GANDHI) ఇక్కడ లేకపోయినా మనం బాధ పడకూడదు అంటూ వ్యాఖ్యానించారు. దేశానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సిన రాహుల్ ఇక్కడ ఉండకపోయినా ఆవేదన చెందకూడదని అన్నారు. ఆయన నిర్ణయాన్ని మనం అంతా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని ఆయనకు మద్దతుగా నిలవాలని కోరారు. దీంతో రాహుల్ ఆ స్థానాన్ని వదులుకోనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అందుకే సుధాకరన్ ఇలా హింట్ ఇచ్చారని తెలుస్తోంది.