BUDGET 2024 : నిర్మల సీతారామన్ సరికొత్త రికార్డు.. కేంద్ర బడ్జెట్ ఇక వర్షాకాల సమావేశాల్లోనే!
ఈ నెల 18వ తేదీ నుంచి లోక్ సభ మొదటి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో బడ్జెట్‌ని ప్రవేశ పెట్టే సూచనలు కనిపించడం లేదు. వర్షాకాల సమావేశాల్లోనే ఈ ఏడాది పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
NIRMALA SITHARAMAN BUDGET 2024 : ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో గత ఫిబ్రవరిలో పూర్తి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టలేదు. అందుకు బదులుగా ఓటాన్ బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తై మళ్లీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్(NIRMALA SITHARAMAN) వరుసగా ఏడో సారి లోక్ సభలో బడ్జెట్‌ని ప్రవేశ పెడతారు. ఇది సరికొత్త రికార్డు. ఇప్పటి వరకు దేశ చరిత్రలో మొరార్జీ దేశాయ్ మాత్రమే ఆరుసార్లు బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. కొత్త లోక్ సభ సమావేశాలు ఈ నెల 18న మొదలవుతాయి. అయితే ఈ సమయంలో కొత్త లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎంపిక లాంటివి ఉంటాయి. దీంతో బడ్జెట్‌ని ప్రవేశ పెట్టేందుకు సమయం సరిపోని పరిస్థితులు ఉన్నాయి. దీంతో వచ్చే వర్షా కాల సమావేశాల్లోనే బడ్జెట్‌ని ప్రవేశ పెడతారు.
ఈ ఏడాది బడ్జెట్‌ని ప్రవేశ పెడితే వరుసగా ఏడు సార్లు బడ్జెట్‌ని ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్(NIRMALA SITHARAMAN) సరికొత్త రికార్డును సృష్టిస్తారు. గతంలో అంటే 2019లో జూన్ 26 వరకు తొలి సమావేశాలు జరపాలని తొలుత భావించారు. చివరికి ఆ సమావేశాలను ఆగస్టు 7 వరకు పొడిగించారు. జులై 5న పూర్తి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. మరి ఇప్పుడు ఎలా ప్రవేశ పెడతారన్నది వేచి చూడాల్సిందే.