CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందరినీ నేను ఒకటే ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్లనే ఎన్నుకోండి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఇంకా ప్రజాస్వామ్య పరిణితి రాలేదు. ఏ దేశాల్లో అయితే వచ్చిందో ఆ దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఈ ఎలక్షన్లు వస్తుంటాయి.. పోతుంటాయి. ఎన్నికలు వస్తున్నాయంటే అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ పడుతుంటారు. చివరికి గెలిచేది మాత్రం ఒకరేనని అన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు వజ్రాయుధం ఓటు. మీరు వేసే ఓటు ఐదేళ్లు మీ తలరాతను లెక్కిస్తుంది. ఏ ప్రభుత్వం గెలిస్తే లాభం వస్తుందో చర్చించండి. ప్రతి పార్టీ చరిత్ర చూడాలి. ఎన్నికలు రాగానే ఆందోళన వద్దు. పార్టీ గురించి తెలుసుకోండి. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుందనేది గమనించి ఓటు వేయండి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలిస్తే మీ కోరికలు నెరవేరుతాయని అన్నారు. కాబట్టి ఆలోచించి ఓటేయండని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని కేసీఆర్ అన్నారు.
ప్రజల హక్కుల కోసం నిర్విరామంగా పోరాడాం. చివరికి చావు అంచుల వరకు వెళ్లి తెలంగాణ సాధించుకున్నాం. రెండుసార్లు బీఆర్ఎస్ను ఎన్నుకున్నారు. తెలంగాణ రాకపోయుంటే నిర్మల్ జిల్లా అయ్యేదా? ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా గురించి పోరాడాడు. ఇవాళ నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి. మళ్లీ ఇంజినీరింగ్ కాలేజీ కావాలని అడిగాడు. ఇంద్రకరణ్ భారీ మెజార్టీతో గెలవాలి. కచ్చితంగా జేఎన్టీయూ నుంచి ఇంజినీరింగ్ కాలేజీ ఇప్పించే బాధ్యత నాదని కేసీఆర్ అన్నారు.