»Government Of Tamil Nadu Is Serious About Youtubers
YouTuber: యూట్యూబర్‌పై ప్రభుత్వం సీరియస్
తమిళనాడుకు చెందిన ఓ యూ ట్యూబర్ ఇరకాటంలో పడ్డాడు. చట్ట విరుద్ధమైన పని చేసినందుకు గాను ప్రభుత్వం నుంచి నోటీసు అందుకున్నాడు. మరోవైపు యూ ట్యూబర్ అప్లోడ్ చేసిన వీడియోను తొలగించాలని సైబర్ క్రైమ్ విభాగానికి ప్రభుత్వం ఆదేశించింది.
Government of Tamil Nadu is serious about YouTubers
YouTuber: తమిళనాడుకు చెందిన ఓ యూ ట్యూబర్ ఇరకాటంలో పడ్డాడు. చట్ట విరుద్ధమైన పని చేసినందుకు గాను ప్రభుత్వం నుంచి నోటీసు అందుకున్నాడు. మరోవైపు యూ ట్యూబర్ అప్లోడ్ చేసిన వీడియోను తొలగించాలని సైబర్ క్రైమ్ విభాగానికి ప్రభుత్వం ఆదేశించింది. ఇంతకీ ఆ యూ ట్యూబర్ చేసిన తప్పేంటి? నిబంధనలను తెలిసే ఉల్లంఘించాడా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
తమిళనాడుకు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి ఓ యూ ట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. ఆ ఛానెల్ ద్వారా తన జీవితంలో జరిగే కీలక ఘట్టాలను వివరిస్తున్నాడు. తన భార్య గర్భవతి అయిన విషయాన్ని కూడా యూ ట్యూబ్ ద్వారా వీక్షకులతో పంచుకున్నాడు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. ఈ క్రమంలో చేసిన ఓ వీడియో ఇర్ఫాన్‌ను చిక్కుల్లో పడేసింది. అతనితో పాటు అతని భార్య కూడా ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది. తన భార్య గర్భవతి అయిన తర్వాత దుబాయ్‌లో ఓ ఆసుపత్రిలో చెకప్ కోసం తీసుకువెళ్లాడు. పనిలో పనిగా తనకు పుట్టబోయే బిడ్డ మగబిడ్డ, ఆడబిడ్డా అనే విషయం నిర్ధారించుకోవాలని అనుకున్నాడు. లింగ నిర్ధారణ పరీక్ష చేయించాడు. తనకు ఎవరు పుట్టబోతున్నారో డాక్టర్ల ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే ఈ విషయమై ఓ వీడియో చేసి యూ ట్యూబ్ ఛానెల్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాడు. అక్కడి నుంచి ఇర్ఫాన్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి చివరకు తమిళనాడు ఆరోగ్యశాఖకు చేరింది. దీంతో అధికారులు వెంటనే రంగంలో దిగారు.
లింగనిర్ధారణ పరీక్షలు చేయించడం మన దేశంలో నిషేధం. అటువంటి నిబంధనలను ఉల్లంఘించిన ఇర్ఫాన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని … డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ రూరల్ సర్వీసెస్ ఆదేశాలు జారీ చేసింది. ఇర్ఫాన్‌ను కూడా సంప్రదించి అతడికి నోటీసులు జారీ చేసింది. ఇర్ఫాన్ అప్లోడ్ చేసిన వీడియోను వెంటనే యూ ట్యూబ్ నుంచి తొలగించాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. 1994లో భారత ప్రభుత్వం P.C.P.N.D.T అనే ఒక చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం లింగ నిర్ధారణ చేయిస్తే అది నేరంగా పరిగణించబడుతోంది. ఈ చట్టానికి 2003, 2011 సంవత్సరాల్లో కొన్ని సవరణలు కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. మరింత పటిష్టంగా చట్టాన్ని అమలు చేసే ఉద్దేశ్యంతో ఈ సవరణలు చేపట్టింది. అప్పటి నుంచి లింగ నిర్ధారణ చేసిన వారిపై ఉక్కుపాదం మోపుతోంది. మన దేశంలో రేడియోలజిస్టులు, గైనకాలజిస్టులు, సోనోలాజిస్టులు తదితరులపై కేంద్రం నిఘా ఉంచింది.
కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే … వెంటనే అబార్షన్ చేయించేవాళ్లు మన దేశంలో అనేక మంది ఉన్నారు. దీని కారణంగా దేశంలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇది గుర్తించిన కేంద్రం భ్రూణ హత్యలను ఆపడానికి గట్టిగా నిర్ణయించుకుంది. కఠిన చట్టాన్ని రూపొందించి అమలు చేస్తోంది. ఆ చట్టమే Pre-Conception and Pre-Natal Diagnostic Techniques చట్టం. ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా తమిళనాడు యూ ట్యూబర్ ఇర్ఫాన్‌పై కూడా చర్యలు చేపట్టారు.