మెగాభిమానిగా వాల్తేరు వీరయ్యను.. అంచనాలకు మించి తెరకెక్కించానని.. బల్లగుద్ది మరీ చెబుతూ వచ్చాడు దర్శకుడు కె. రవీంద్ర అలియాస్ బాబీ. దాంతో మెగాభిమానులు వాల్తేరు వీరయ్య థియేటర్లోకి ఎప్పుడొస్తాడా.. అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు జనవరి 13న, వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయిపోయింది. ఆచార్యతో ఫ్లాఫ్ అందుకున్న మెగాస్టార్, గాడ్ ఫాదర్తోను సరిగ్గా మెప్పించలేకపోయాడు. అందుకే వాల్తేరు వీరయ్య పై భారీ ఆశలు పెట్టుకున్నారు మెగాభిమానులు. చిరు కూడా మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాలని చూస్తున్నాడు. పైగా ఈ సినిమాలో రవితేజ కూడా నటిస్తుండడం.. మెగాస్టార్‌కు మరింత కలిసొచ్చే విషయం. మరి వాల్తేరు వీరయ్య చిత్రం ఎలా ఉంది. మెగాస్టార్ హిట్ కొట్టాడా.. అసలు వీరయ్య కథేంటి!
కథ విషయానికి వస్తే.. సాల్మన్ సీజర్ (బాబీ సింహా)ను డ్రగ్ డాన్‌గా ఇంట్రడక్షన్ చేస్తూ.. మారెడు మిల్లిలో కథ మొదలవుతుంది. తప్పని పరిస్థితుల్లో ఓ నైట్ మారెడుమిల్లి పోలీస్ స్టేషన్లో అతన్ని ఉంచాల్సి వస్తుంది. అక్కడ అరాచకం చేసి పోలీసులను చంపి తప్పించుకుంటాడు సాల్మన్. దాంతో స్టేషన్ ఇన్స్పెక్టర్ సీతాపతి(రాజేంద్రప్రసాద్) ఆ బాధను తట్టుకోలేక.. సాల్మన్‌ను పట్టుకోవాలనుకుంటాడు. కానీ అది తన వల్ల కాదని.. అందుకు సమర్దుడైన ఓ వ్యక్తి కోసం వెతుకుతున్న క్రమంలో.. వాల్తేర్ వీరయ్య కనబడతాడు. కోర్టు కేసులో వీరయ్యకు పాతిక లక్షలు అవసరం ఉండడంతో.. సీతాపతితో డీల్ ఓకే చేసుకుంటాడు. ఇక సాల్మన్‌ను వెతుక్కుంటూ కథ మలేషియా వెళ్తుంది. అక్కడ అదితి(శృతి హాసన్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత శృతి హాసన్ గురించి ఓ నిజం తెలుస్తుంది. వీరయ్య కూడా అందరికీ షాక్ ఇస్తాడు. తన టార్గెట్ సాల్మన్ కాదని.. అతని అన్న మైఖేల్(ప్రకాష్ రాజ్) అనే ట్విస్ట్ రివీల్ అవుతుంది. మీ కథలోకి నేను రాలేదు.. నా కథలోకి మీరందరూ వచ్చారని.. వీరయ్య చెప్పడంతో.. అసలు పూనకాలు లోడింగ్ స్టార్ట్ అవుతుంది. మరి జాలరి పేటలో ఉన్న వీరయ్యకు, డ్రగ్ మాఫియా డాన్ మైఖేల్‌కు ఉన్న సబంధం ఏంటి.. అసలు వీరయ్య ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాడు.. రవితేజ క్యారెక్టర్ ఏంటి.. అనేది తెలియాలంటే.. తెర పై చూడాల్సిందే.
ఇక ఫస్టాఫ్ మొత్తం ఎటంర్టైన్ చేసేందుకు ప్రయత్నించిన మెగాస్టార్.. సెకండాఫ్‌లో రవితేజ ఎంట్రీతో కథ మారిపోతుంది. అసలు ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్యాంగ్ తప్పితే.. ఏం లేదనే చెప్పాలి. కథ మొత్తం సెకండాఫ్‌లోనే ఉంది. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమే ఫస్టాఫ్ తీశారని చెప్పొచ్చు. కానీ రవితేజ ఎంట్రీ, అతని క్యారెక్టర్, అన్నదమ్ముల సెంటిమెంట్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా కొత్త కథేమీ చెప్పదు. అన్ని సినిమాల్లాగే.. ఫ్యాన్స్ కోసం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ రాసుకున్నారు. కాకపోతే మెగాస్టార్ వింటేజ్ లుక్, భాష యాస బాగుంది. చిరు కామెడీ టైమింగ్.. ఆయన నోట వచ్చే జంబలకిడి జారు మిఠాయ పాట ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే కోపదారి మనిషి కామెడీ కూడా ఇందులో ఇరికించారు. ఈ కామెడి మెగాస్టార్ స్థాయి కాకపోయినా.. ఓకేలే అనిపిస్తుంది. ఇక మాస్ మహారాజా పాత్ర ఈ సినిమాకు ఆయువు పట్టు. ఆ క్యారెక్టర్లో రవితేజను తప్పా మరో హీరోని ఊహించుకోలేం. తెలంగాణ యాసతో పోలీసు ఆఫీసర్‌గా ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ అన్నయ్య సినిమాలోని చిరు, రవితేజనే వాల్తేరు వీరయ్యలో చూడొచ్చు. ఇద్దరి మధ్య సెంటిమెంట్ సీన్స్ ఫ్యాన్స్‌ను కంటతడి పెట్టించేలా ఉంటాయి. అనుకున్నట్టుగానే బాబీ.. ఇద్దిరిని బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే చిరంజీవి, ప్రకాష్ రాజ్ మధ్య విలనిజం పెద్దగా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ చుట్టేసినట్టు అనిపిస్తుంది. ఇక శృతి హాసన్ గ్లామర్, పాటల వరకు ఓకే. రవితేజకు జోడిగా నటించిన కేథరిన్‌కు కూడా ఇంపార్టెంట్ రోల్ పడింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ బీజిఎం సోసోగానే ఉంది.