టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ తీరు సరిగ్గా లేదంటూ పలువురు హైకోర్టు లో పిటీషన్లు దాఖలు చేసారు. వీటిని సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు పిటీషనర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసును ప్రస్తుతం విచారిస్తున్న సిట్ నుంచి సీబీఐకి అప్పగించింది. సిట్ అధికారులు వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ విచారణను నిలిపివేయటంతో పాటుగా రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించింది.
గత అక్టోబర్ లో టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ మద్దతుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు కొనుగోలు బేరసారాలు ఆడారంటూ ఫిర్యాదు నమోదైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి విచారణ బాధ్యతలు అప్పగించింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి..సిట్ పలుమార్లు విచారణ చేసింది. బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్ తో సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆ నోటీసుల పైన స్టే ఇచ్చింది. తాజాగా హైకోర్టులో సిట్ విచారణ రద్దు చేసి సీబీఐకు అప్పగించాలనే పిటీషన్ల పైన విచారణ సాగింది. దర్యాప్తు వివరాల లీకులపై పిటిషనర్లు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
సీఎం కేసీఆర్ సైతం ఆధారాలను లీక్ చేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల తరఫున మహేశ్ జఠ్మలానీ, సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ల వాదనలతో ఏకీభవించింది. సిట్‌ను క్వాష్ చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ తీర్పు వెలువరించింది. ఇప్పుడు హైకోర్టు తీర్పు పైన డివిజన్ బెంచ్ లో రిట్ అప్పీల్ కు వెళ్లాలని సిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.