తెలంగాణ పీసీసీ అధక్యుడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెడుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేయడం మొదలుపెట్టారో… అప్పుడే… రేవంత్ కొత్త పార్టీ పెడుతున్నాడంటూ వార్తలు రావడం మొదలైంది. ‘తెలంగాణ సామాజిక కాంగ్రెస్’ పేరుతో ఇప్పటికే ఈసీ వద్ద పార్టీని రిజిస్టర్ చేయించారని కూడా వార్తలు వచ్చాయి. అయితే… ఈ వార్తలను అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఖండించింది కానీ…. రేవంత్ రెడ్డి మాత్రం నోరు విప్పలేదు.
కాగా… తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ స్పందించారు. ‘రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అంత తేలికగా తీసుకోవొద్దు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను రేవంత్ సీరియస్‌గా తీసుకోవాలి. ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాలి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌ను మార్చి వేరే వారిని ఇంచార్జ్‌గా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ వచ్చి సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ అధిష్టానానికి ఎలాంటి నివేదిక సమర్పిస్తారనేది చూడాలి. ఆయన నివేదికతో అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా’ అని వీహెచ్ పేర్కొన్నారు.