తెలంగాణ బడ్జెట్లో ఆర్థికమంత్రి హరీశ్ రావు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అన్ని వర్గాలకు సంతృప్తి పరుస్తూ కేటాయింపులు చేశారు. బడ్జెట్ మొత్తం 2,90,396 లక్షల కోట్లు కాగా.. అందులో షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి ఎక్కువ నిధులను కేటాయించారు. 36, 750 కోట్లు దళితులకు కేటాయించి ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. దళితబంధుకు 17,700 కోట్లు కేటాయించారు. ఎస్టీల ప్రత్యేక నిధి రూ.15,233 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
గిరిజనులకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చి.. పాలన మరింత చేరువ చేశామన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా విదేశీ విద్య కోసం ఎస్సీలకు రూ.20 లక్షల వరకు సాయం చేస్తున్నామని వివరించారు.
దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం తమ ప్రభుత్వం చేస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దళితులు వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ లైసెన్స్ ద్వారా చేసే బిజినెస్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నామని వివరించారు. దళితుల గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని పేర్కొన్నారు.
‘స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్లు అవుతున్నా దళితవాడలు పేదరికానికి చిరునామాగా ఉన్నాయి. వారి కోసం ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే దళితబంధు అని చెప్పారు. దళితులు స్వశక్తితో జీవించాలని సీఎం కేసీఆర్ మదిలో దళిత పథకం మెదిలిందన్నారు. ఈ పథకం ఆయా కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తుందన్నారు. ఆ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడటానికి తోడ్పడుతుంది’ అని మంత్రి హరీశ్ రావు వివరించారు.