తెలంగాణణ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జ్ మాణిక్ రావు హైదరాబాద్ నగరంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. కాగా…. ఆయనకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు భట్టివిక్రమార్క తదితరులు మాణిక్ రావుకు ఘన స్వాగతం పలికారు. గాంధీ భవన్లో వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మొదట ఇంచార్జ్ ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. తర్వాత పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేత, పీఏసీ సభ్యులతో వ్యక్తిగత భేటీలు నిర్వహించనున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు పీఏసీ సభ్యుల సమావేశం నిర్వహించనున్నారు. రేపు డీసీసీ లు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, అధికార ప్రతినిధులతో సమావేశాలు చేపట్టనున్నారు.
గత కొన్ని వారాలుగా తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కాంగ్రెస్ కమిటీల ప్రకటనతో సీనియర్ నేతలు మాటల యుద్ధం మొదలు పెట్టారు. తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అప్పటి ఇన్చార్జ్ మాణికం ఠాగూర్ వ్యవహారశైలిపై అనేక మంది సీనియర్లు ఫిర్యాదు చేశారు. అధిష్టానికి ఫిర్యాదులు అందడంతో దిగ్విజయ్ సింగ్ రంగంలో దిగారు.
సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించారు. వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధిష్టానానికి రిపోర్టు ఇచ్చారు. కొన్ని రోజుల వ్యవధిలో ఇన్చార్జ్ మార్పు జరిగింది. కొత్త ఇన్చార్జ్ గా మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావును కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇంకా ఎక్కువ కాలం లేని ఈ సమయంలో కాంగ్రెస్ నేతలందరినీ ఏకతాటిపై తెచ్చేందుకు రంగంలో దిగారు. వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.