తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలును సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఫేస్ బుక్ పేజీలో సీఎం కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా పెట్టిన పోస్టుల గురించి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని కోరగా, ఇవాళ సునీల్ వచ్చారు. వీడియో మార్పింగ్, పోస్టింగుల గురించి పలు ప్రశ్నలు వేశారు. విచారణలో ఆయన చెప్పిన సమాధానాలను రికార్డ్ కూడా చేశారు. కేసు విషయమై మళ్లీ పిలిస్తే కూడా రావాలని పోలీసులు స్పష్టంచేశారు. సునీల్ కనుగోలు నిన్ననే విచారణకు హాజరుకావాల్సి ఉంది. సోమవారం విచారణకు హాజరువుతానని పోలీసులకు సమాచారం ఇచ్చి, ఇవాళ అటెండ్ అయ్యారు.
టీ కాంగ్రెస్ వార్ రూమ్ పేరుతో సోషల్ మీడియా నిర్వహిస్తోంది. దాని ఆఫీసు మాదాపూర్‌లో ఉంది. నిర్వాహకుడిని తానేనని ఇదివరకే మల్లు రవి ప్రకటన చేశారు. ఇస్తే తనకే నోటీసులు ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులను ఇస్తారు. అక్కడే తెలంగాణ గళం పేరుతో ఫేస్ బుక్‌లో పేజీ క్రియేట్ చేశారు. సునీల్ కనుగోలు నేతృత్వంలో వార్ రూమ్ ఏర్పాటు చేశారు. అందులో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురిని కించపరిచేలా పోస్టింగ్స్ ఉన్నాయి. మంత్రి కేటీఆర్, కవితకు వ్యతిరేకంగా కామెంట్స్ కూడా ఉన్నాయి. పక్కా సమాచారంతో అప్పుడే మాదాపూర్‌లో గల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్ రూమ్‌పై దాడులు చేశారు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, శ్రీప్రతాప్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారికి నోటీసులు ఇచ్చి వదిలేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలు అని పోలీసులు ఆ సమయంలోనే చెప్పారు. సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. సునీల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అతనిని అరెస్టు చేయవద్దని మాత్రం పోలీసులను ఈ నెల 3వ తేదీన ఆదేశించింది. విచారణకు హాజరు కావాలని ఇటు సునీల్ కనుగోలుకు స్పష్టంచేసింది. దీంతో జనవరి 8వ తేదీన (ఆదివారం) విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు హాజరవుతానని సునీల్ కనుగోలు పోలీసులకు తెలిపారు.
కేసీఆర్, ఆయన ఫ్యామిలీపై చేసిన పోస్టులతో తనకు సంబంధం లేదని సునీల్ కనుగోలు ఇదివరకే హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ గళం పేరుతో నిర్వహిస్తున్న ఫేస్ బుక్ పేజీతో తనకు సంబంధం లేదని సునీల్ కనుగోలు తెలిపారు. తనను కావాలనే కేసులో ఇరికించారని ఆయన అంటున్నారు. అంతకుముందే కాంగ్రెస్ వార్ రూమ్‌పై పోలీసులు దాడి చేసి కంప్యూటర్లను స్వాధీం చేసుకున్నారు. వాటిని పరిశీలించిన తర్వాతే సునీల్ కీలక సూత్రధారి అని నిర్ధారణకు వచ్చారు. అందుకోసమే అతనికి నోటీసులు ఇచ్చారు. కానీ నిన్న డుమ్మా కొట్టి, ఇవాళ మధ్యాహ్నం విచారణకు హాజరయ్యాడు.
ఈ ఏడాది డిసంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పోటీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్లేందుకు వ్యుహారచన రచించింది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే వేగంగా చేరుకోవచ్చని, వార్ రూమ్ పేరుతో ఆఫీసు కూడా తెరిచింది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో మాత్రం చెప్పకుండా, వ్యక్తిగతంగా పోస్టింగులు, వీడియోలు మార్పింగ్ చేశారు. వాటిని సీసీఎస్ పోలీసులు గుర్తించడంతో విషయం తెలిసింది. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. దీనికి సూత్రధారి అయిన సునీల్ మాత్రం తనకేదీ తెలియదు అంటున్నారు.