టీచర్ల డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన టీచర్లను విడుదల చేయాలని కోరారు. కేసీఆర్ సర్కార్ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఉందన్నారు. పసిపిల్లలు ఏడుస్తున్నా మనసు కరగడం లేదా? తల్లులను, పిల్లలను వేరుచేసి అరెస్ట్ చేస్తారా? అని ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప భావోద్వేగాలు పట్టవా? మానవత్వం లేదా అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
భార్యభర్తలు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలని అడగడమే వారు చేసిన తప్ప అని నిలదీశారు. 317 జీవో సవరించాలని ఆందోళన చేస్తున్న టీచర్ల పట్ల పోలీసుల వైఖరి సరిగా లేన్నారు. భార్యను ఓ చోట, భర్తను మరో చోట బదిలీ చేయడం అన్యాయం అన్నారు. ఈ విధానాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. సమస్యపై ప్రభుత్వం స్పందించాలని తేల్చిచెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 317 జీవోను సవరిస్తామని హామీనిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోరికను తీరుస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.
టీచర్ల బదిలీకి సంభందించిన ప్రక్రియను ఈ నెల 27వ తేదీన ప్రారంభించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల పారదర్శకంగా నిర్వహించాలన్నారు. న్యాయపర సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నారు. సాఫ్ట్ వేర్లో లోపం తలెత్తకుండా చూసుకోవాలని, ఆ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను ఆయా జిల్లాల్లో పర్యవేక్షలుగా నియమించాలని సూచించారు.