తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ దూకుడు కనిపిస్తోంది. నిన్నటి వరకు నిర్లిప్తంగా, సీనియర్లు-జూనియర్లు అంటూ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు కనిపించిన హస్తం పార్టీ సోమవారం జోరుమీద కనిపించింది. సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టేందుకు రావాలని ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం రేవంత్ తీరుపట్ల సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన అధిష్టానం దిగ్విజయ్ సింగ్‌ను పరిష్కరించేందుకు హైదరాబాద్ పంపించింది. ఇరు వర్గాలతో మాట్లాడిన డిగ్గీరాజా సమస్యను కొలిక్కి తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. అప్పటి నుండి సీనియర్లు అసంతృప్తి అంటూ రోడ్డెక్కలేదు.
ఈ రోజు ధర్నా కార్యక్రమానికి ఒకరిద్దరు మినహా సీనియర్లు అందరూ వచ్చే ప్రయత్నం చేశారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ తదితరులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ధర్నా కార్యక్రమానికి తరలి వస్తున్న కేడర్‌ను అడ్డుకున్నారు. ఇటీవల రేవంత్ కొత్త పార్టీ, మీడియా హౌస్ పెడతారనే ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు పార్టీ కార్యక్రమం కోసం రేవంత్, ఆయన కేడర్ ఉత్సాహం చూస్తుంటే, వచ్చే ఎన్నికల్లోను ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, అసంతృప్త సీనియర్లపై బుజ్జగింపు ఫలించినట్లుగా కనిపిస్తోంది. మల్లుభట్టి వంటి అసంతృప్త రాగం వినిపించిన నాయకులు కూడా పాలుపంచుకున్నారు.
రేవంత్ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావించి, సీనియర్లకు స్పష్టంగా చెప్పి ఉంటుందని, ఇక తమ అధినేత వరుసగా ప్రభుత్వ వైఫల్యాలపై కార్యక్రమాలు చేపడతారని కాంగ్రెస్ కేడర్ చెబుతోంది. తాము బీజేపీ కంటే వెనుకబడ్డామని మీడియా, ఇతర పార్టీలు చెబుతూ వచ్చాయని, కానీ పార్టీలోని అంతర్గత అంశాల కారణంగా తమ పార్టీ బలహీనంగా భావించారని, ఇక వరుస కార్యక్రమాలతో 2023లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ధర్నా చౌక్ వద్దకు వెళ్లకుండా రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తనను ఎందుకు వెళ్లనివ్వడం లేదో చెప్పాలని, నా ఇంటి నుండి నేను బయటకు వస్తే అనుమతి తీసుకోవాలా, హైదరాబాద్‌లో దాదాపు సగం నా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఉందని, అలాంటప్పుడు తాను తిరగకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తాను ఎటు వెళ్లేది పోలీసులకు చెప్పవలసిన అవసరం లేదన్నారు. సర్పంచ్ల ఆత్మహత్యలను పట్టించుకోరా అని నిలదీశారు. అయితే అనుమతి లేనందునే అడ్డుకున్నామని పోలీసులు చెప్పారు. రేవంత్ ధర్నాకు వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. గాంధీ భవన్ ముందు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రగతి భవన్ ముందు నిరసనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్‌తో పాటు విజయారెడ్డి, మల్లు రవి, మల్లు భట్టి విక్రమార్క తదితరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.