NDL: కోటపాడు గ్రామంలో బీటెక్ విద్యార్థిని వైష్ణవి రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడలో పసుపు రంగు నీళ్లు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వైష్ణవి కర్నూలు పట్టణంలో బీటెక్ సెకండియర్ చదువుతున్నది. పరీక్షల్లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి విక్రమ్ పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అన్నమయ్య: జిల్లా ఇంఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన రద్దు అయినట్లు కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8, 9 తేదీల్లో జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల రద్దయింది. దీంతో నియోజకవర్గాల్లో మార్కెట్ చైర్మన్‌ల నియామకాలు కొలిక్కి వస్తుందన్న ఆశావాహులకు మళ్లీ నిరాశే ఎదురైంది.
NTR: రబీలో పండిన ధాన్యాన్ని మద్దతు ధర ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో ఆయన పర్యటించారు. రైతులతో మాట్లాడి ధాన్యం అమ్ముకోవడంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రబీలో ధాన్యానికి మద్దతు ధర దక్కడంలేదని రైతులు వాపోయారు.
KMM: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఖమ్మంలోని తన నివాసానికి సమీపాన ఉన్న శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆదివారం సాయంత్రం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర కొబ్బరికాయ కొట్టి తన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేసి పూజారి నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆశీర్వచనాలు అందుకున్నారు.
SRCL: ఫుడ్ పాయిజన్‌తో ఓ మహిళ ఆదివారం మృతి చెందింది. రుద్రంగికి చెందిన కాదాసు పుష్పలత (35), ఆమె కుమారుడు నిహాల్ (6) శుక్రవారం రాత్రి ఇంట్లో చపాతీలు తిని పడుకున్నారు. రాత్రి ఇద్దరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. వారిని కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పుష్పలత పరిస్థితి విషమించి మరణించింది.
ASR: ఎంపీడీవో ఆఫీసులో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారంన రద్దు చేసినట్లు ఆదివారం అరకులోయ ఎంపీడీవో లవరాజు తెలిపారు. రేపు సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకులోయ పర్యటన కారణంగా రేపు జరగవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేయడం జరిగిందని ఎంపీడీవో పేర్కొన్నారు. కావున ప్రజలు గమనించగలరని కోరారు.
HNK: కాజీపేట మండల కేంద్రంలోని వడ్డేపల్లి ట్యాంక్ బండ్‌పై రేపు ఉదయం 8 గంటలకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగు మెగా రక్తదాన శిబిరాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించనున్నారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 యూనిట్ల రక్తం సేకరణ లక్ష్యంగా జరుగుతున్న వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
NDL: ఇండ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు హెచ్చరించారు. ఆదివారం నందికోట్కూరు మున్సిపాలిటీ వాల్మీకి నగర్‌లో విద్యుత్ స్మార్ట్ మీటర్ల స్టిక్కర్ విడుదల చేసి, ఇండ్లకు అతికించడం జరిగింది. జగన్ చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లుతుందన్నారు.
JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కూడా ఛైర్మన్ గట్టు ప్రసాద్ బాబు గౌడ్‌ను నేడు మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాడికొండ రాజయ్య పరామర్శించారు. ప్రసాద్ బాబు అస్వస్థతో బాధపడుతున్నట్లుగా తెలుసుకున్న రాజయ్య బీఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్లి భరోసా కల్పించారు.
KNR: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలా సాగింది. భద్రాచలం తర్వాత రెండవ అతిపెద్ద కళ్యాణ మహోత్సవం ఇల్లందకుంటలో జరుగుతుండడంతో జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తునకి తరలివచ్చారు. హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
NDL: శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ సందర్భంగా పగిడ్యాలలో సోమవారం పోట్టేల పందెములు నిర్వహిస్తున్నట్లు కార్య నిర్వాహకులు బి.నాగేశ్వ రెడ్డి, శివరామి రెడ్డిలు ఆదివారం తెలిపారు. గెలుపొందిన వారికి రూ.8.000, రూ.6.000, రూ.4.000 మూడు బహుమతులు కలవన్నారు. వివరములకై సెల్:9949493857ను సంప్రదించాలని తెలిపారు.
KDP: ప్రమాదవశాత్తు, సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు బీమా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ బాదుల్లా పేర్కొన్నారు. ఆదివారం కడపలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు చనిపోయిన కార్మికుల కుటుంబాలు అందరికీ సహాయం అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
KDP: గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 2432 టిడ్కో ఇళ్లను ప్రజలకు పంపిణీ చేయలేదని కడప ఎమ్మెల్యే మాధవి ఆరోపించారు. కడపలోని లక్ష్మీ నగర్లో టిడ్కో ఇళ్లకు రోడ్ పనులను ఆమె ప్రారంభించారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ హయాంలో ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం ఇళ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు.
GNTR: నగరపాలక సంస్థలో సోమవారం (ఏప్రిల్ 7) పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు జనన మరణ నమోదు కార్యాలయం (పార్కింగ్ వద్ద) నిర్వహిస్తామని జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. అదే రోజున కౌన్సిల్ హాల్లో వార్షిక బడ్జెట్ సమావేశం జరుగనున్నందున ఈ స్థల మార్పు జరిగిందన్నారు.
HYD: మే 20న నిర్వహించే సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం ఈనెల 8న బాగ్ లింగంపల్లిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాల్ రాజు తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సులో పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక ధోరణులపై చర్చిస్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు.