VKB: జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో వేసవిలో నీటి ఎద్దడి నివారించేలా చర్యలు తీసుకోవడంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి ఎద్దడిని గుర్తించి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తూ నీటిఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
NZB: ఇందల్వాయిమండల డోన్‌కల్‌కు చెందిన భార్గవి అనే మహిళ శనివారం అంబులెన్స్‌లో ప్రసవించింది. పురిటి నొప్పులతో 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ అంబాదాస్, పైలెట్ అబ్దుల్ చాకచక్యంగా ప్రసవం చేయగా.. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు.
W.G: పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నియోజకవర్గ పరిశీలకులను శుక్రవారం రాత్రి పార్టీ అధిష్టానం నియమించింది. ఆచంట ఎడ్ల తాతాజీ, పాలకొల్లు పేరిచర్ల విజయ నరసింహారాజు, నరసాపురం ముప్పిడి సంపత్ కుమార్, తణుకు కొట్టు నాగేంద్ర, తాడేపల్లిగూడెం వెండ్ర వెంకటస్వామి నియమితులయ్యారు. వీరందరూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
PPM: జిల్లాలో రీ-సర్వే ప్రక్రియను ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని, ఎటువంటి జాప్యం జరగకూడదని జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రీ-సర్వే పనుల పురోగతిపై జేసీ శుక్రవారం బలిజిపేట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విలేజ్ సర్వేయర్లు, వీఆర్వోలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
VSP: జిల్లాలో మార్చి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తునట్లు డీఈవో ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో వరుస సెలవులు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా ఇవాళ పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.
SKLM: సోంపేట మండలం ఎం.జగతిపురంకి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన అనిల్ అనే యువకుడిని కాశీబుగ్గ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో ఆమెను కాశీబుగ్గలోని లాడ్జికి రప్పించి మూడు తులాల బంగారం తీసుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ATP: మహిళా భద్రత, పోక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు మంజునాథ్ అనే వ్యక్తి హిందూపురం నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోని మిడుతూరుకు చేరుకోగా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొంకరి కమలమ్మ ఆయనను కలిసి అభినందించారు. సమాజంలో బాలికలు, మహిళల రక్షణపై చైతన్యం తెచ్చే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.
సత్యసాయి: పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తామన్న నారా లోకేష్ హామీలు ఏమయ్యాయని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. గ్యాస్ ధరల పెంపుతో ప్రజల నెత్తిన బండ వేస్తున్నారని మండిపడ్డారు. పెంచిన ధరల భారానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గ్యాస్ సిలిండర్‌పై రాయితీ ఇచ్చారని గుర్తుచేశారు.
AKP: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించే విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పరిశోధన అధికారులతో సమీక్షించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధంగా చూడాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ యంత్రాలపై చర్చించారు.
TG: కాసేపట్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ప్రశ్నాపత్రం ఇవ్వగానే అన్ని ప్రశ్నలను ఒకసారి చదవండి. మీకు బాగా తెలిసిన సమాధానాలను ముందుగా రాయండి. పరీక్షా సమయంలో ప్రశాంతంగా ఉండండి. ALL THE BEST
ప్రకాశం: బేస్తవారిపేటలోని బీసీ కాలనీలో ఇవాళ తెల్లవారుజామున సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను పరిశీలించారు. పలు మోటార్ సైకిళ్లు పత్రాలు లేకుండా కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు సీఐ మల్లికార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు.
KDP: జిల్లాలో సోమవారం నుంచి 10th పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులు మానసిక ప్రశాంతతో, ఏకాగ్రతగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని DEO శంషుద్దీన్ సూచించారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు.
ADB: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించటం జరుగుతుందని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాత్నాల మండలంలోని దుబ్బగూడ గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజు, మోకశి, యువకులు తదితరులున్నారు.
WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనగణన-2027పై అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జనాభా లెక్కల సేకరణ ప్రభుత్వ పథకాల అమలుకు, దేశాభివృద్ధికి దిక్సూచి వంటిదని పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.