JGL: మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ శివారులోని చెరువు వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్, బైక్ ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ముద్దంగుల కిష్టయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 52 కమర్షియల్ పౌల్ట్రీల్లో 24 లక్షల కోళ్లు ఉన్నాయని, 10చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతర జిల్లాల్లోని కోళ్ల ఉత్పత్తులు రానీయకుండా అరికట్టామన్నారు. ఇక్కడి మాంసం విక్రయదారులపై ఆంక్షలు విధించవద్దన్నారు. అంగన్వాడీ, పాఠశాలల్లో గుడ్లను బాగా ఉడికించాలని సూచించారు.
VZM: చీపురుపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎ.రాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఐదవ తరగతి 80 సీట్లు, ఇంటర్మీడియట్ 80 సీట్లు ఉన్నట్లు ఆమె వెల్లడి చేశారు. మార్చి 6వ తేదీ లోపు వెబ్‌సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలిపారు.
MNCL: చెన్నూర్కు చెందిన లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఏల్పుల పోచం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లైవ్ డ్రాయింగ్ యాత్ర పూర్తి చేసిన తొలి ఆర్టిస్టుగా ప్రఖ్యాతి గాంచారు. భారతదేశ నలుమూలల తిరుగుతూ చిత్రకళ ద్వారా ప్రాచీన ప్రస్తుత వారసత్వ సంపదను, లైవ్ డ్రాయింగ్ అధ్యయనం చేసి రికార్డు నెలకొల్పాడు.
కొనసీమ: మండల కేంద్రం ఆలమూరులో గత మూడు రోజులుగా పంచాయితీ కుళాయి నీరు సరఫరా కాకపోవడంతో త్రాగు నీరు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుందాపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
GNTR: ప్రశ్నించటానికే పుట్టానన్న పవన్ కళ్యాణ్ పాలనను పక్కనపెట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతున్న ఈ డిప్యూటీ సీఎం రాష్ట్రానికి అవసరమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్ అయ్యారు. పవన్ను జనం నమ్మారు గెలిపించారు. ఇప్పుడు ప్రశ్నించడం, పరిపాలన మానేసి కాషాయ గుడ్డలు వేసుకొని తిరుగుతుంటే దేవాదాయ శాఖ మంత్రి ఇస్తే సరిపోతుందన్నారు.
NZB: మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 1078.30 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో 40.583 టీఎంసీల నీటి నిలువ ఉంది. మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి నీటి ఆవిరి రూపంలో 309 క్యూసెక్కులు క్రమంగా తగ్గుతుందన్నారు.
GNTR: పూరి నుంచి తిరుపతి వెళుతున్న (17479) ఎక్స్‌ప్రెస్ రైల్లో భారీగా గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ 3వ నంబర్ ప్లాట్ ఫామ్ పై పోలీసులు తనిఖీలు నిర్వహించి 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోచ్ 4 బ్యాగుల్లో గంజాయి లభించగా నిందితులు మాత్రం పరారు. గంజాయి ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారు,త్వరలో పట్టుకుంటామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
కామారెడ్డి: చైల్డ్ హుడ్ కేన్సర్ పై అవగాహన కోసం పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హాఫ్ మారథాన్ నిర్వహించనున్నట్లు పద్మపాని సొసైటీ చైర్మన్ సత్య నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. విద్యా సంస్థల సహకారంతో మార్చి 2న స్టేట్ లెవల్ కామారెడ్డి హాఫ్ మారథాన్ కార్యక్రమం ఉంటుందన్నారు.
NZB: నగరంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ అహ్మద్ శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని దర్గా, స్మశాన వాటిక స్థలంలో అక్రమంగా మొరం తవ్వుతున్నారన్నారు. స్థలాన్ని కాపాడాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని కలెక్టర్‌కు వివరించారు.
PLD: పల్నాడు జిల్లా ఎస్పీ కే. శ్రీనివాసరావు శనివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. ప్రకృతిలో మొక్కల పెంపకం వలన కలిగే ప్రయోజనాలు ఎస్పీ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ఖచ్చితంగా స్వీకరించాలన్నారు. అదనపు ఎస్పీలు జేవి సంతోష్, అడిషనల్ ఎస్పీ సత్తిబాబు పాల్గొన్నారు.
VZM: స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని నెల్లిమర్ల మునిసిపల్ కమిషనర్ కె.అప్పలరాజు పిలుపునిచ్చారు. మూడవ శనివారం నిర్వహించే స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక కేజీబివీ పాఠశాల,సువ్వాని వీధిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్యం మరింత మెరుగుపర్పాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్చ ఆంధ్రకు శ్రీకారం చుట్టిందన్నారు.
VZM: దత్తిరాజేరు మండలంలోని దాసుపేట గ్రామంలో శనివారం నిర్వహించిన రామాలయం ప్రతిష్ట మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
KRISHNA: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కోరారు. శనివారం కె.బి.ఎన్ కాలేజీలో ఉపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యయులకు ఎన్నికల ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు.
CTR: సదుం ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నాయకుడు చినేపల్లి ఆనంద(54) అస్వస్థతతో శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా ఆయన రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆనంద మృతికి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.