ATP: రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
AP: గుంటూరు జిల్లా అత్తోట గ్రామ రైతు రోశయ్యపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. ’80 ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న రోశయ్య విజయగాధ స్ఫూర్తిదాయకం. 2016లో తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది రోశయ్య సాధిస్తున్న విజయాలు ఆదర్శం’ అని పేర్కొన్నారు.
NDL: మహానంది మండలం తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యువతులకు HPV వ్యాధి నిరోధక టీకాలు అందించారు. వైద్యాధికారి డా. భగవాన్ దాస్ ఆధ్వర్యంలో శుక్రవారం బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ అమీనాభి, ఫార్మసి ఆఫీసర్ శేఖర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని, ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సిబ్బందిని కోరారు.
NLG: చిట్యాల మున్సిపాలిటీలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు పాలకవర్గం కీలక చర్యలు చేపట్టింది. అన్ని వార్డుల్లో కుక్కల స్వైరవిహారంతో ప్రజలు భయాందోళన చెందుతున్న విషయాన్ని గుర్తించి, వాటిని పట్టించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. పట్టుకున్న కుక్కలను అటవీ ప్రాంతంలో వదిలేలా ఏర్పాట్లు చేశారు. గురు, శుక్రవారాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
VKB: జిల్లాలో ఎండలు రోజురోజుకూ నిప్పులు చెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా ‘జన సున్వాయి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శైలజ ముఖ్య అతిథిగా హాజరై వివిధ సమస్యలతో వచ్చిన మహిళల వినతులను స్వీకరించారు. వారి సమస్యలను విన్న అనంతరం సంబంధిత అధికారులకు పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ రామలక్ష్మి పాల్గొన్నారు.
CTR: 2025 డిసెంబర్ నెలలో జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలలో నగరి మండలం నెత్తం కండ్రిగ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి కే.దిలీప్ ఎంపిక అయ్యాడు. ఈమేరకు ఎంఈవోలు పీఎన్ శ్రీదేవి, నమశ్శివాయ ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టుదల, కృషి ఉంటే ఏమైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
MNCL: పాఠశాలకు, విద్యార్థికి విడదీయలేని అనుబంధం ఉంటుందని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ అన్నారు. జన్నారం మండలంలోని పోన్కల్ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. ఆడుతూ, పాడుతూ చదువుకునే దశ అందరికీ తీపి జ్ఞాపకాలను మిగులుస్తుందన్నారు.
PPM: జిల్లా కేంద్రంలో కవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొల్ల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
MBNR: అడ్డాకుల మండల కేంద్రంలో రూ.30 లక్షల నిధులతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ కేంద్రానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక PHCలో వైద్య శిబిరాన్ని సందర్శించారు. అలాగే ఎంపీడీవో కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
TPT: మహాకవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొల్ల తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కుమార్ సహా అధికారులు పాల్గొన్నారు.
KMM: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలోనూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమలరాజు విమర్శించారు. శుక్రవారం చింతకాని మండలంలోని నాగులవంచ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు వంకాయలపాటి సత్యనారాయణ నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
PDPL: పెద్దపల్లి మండలం చికురాయి గ్రామ రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు అధిక మోతాదులో యూరియా వాడకుండా నానో యూరియా వినియోగం పెంచాలని జిల్లా సహకార అధికారిణి శ్రీమాల సూచించారు. IFFCO ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నానో యూరియా ప్రయోజనాలను వివరించారు.
GDWL: భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారాముల కళ్యాణ తలంబ్రాలను పోస్టల్ శాఖ ద్వారా బుక్ చేసుకోవచ్చని అయిజ సబ్ పోస్టు మాస్టర్ ప్రశాంత్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోస్ట్ ఆఫీసులో బుకింగ్ ప్రారంభమైంది. రూ.151కు ముత్యాల తలంబ్రాలు, రూ.450కు అంతరాలయ అర్చన తలంబ్రాలు పొందే అవకాశం ఉందన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వాడుతున్న 31 సెంటర్లను గుర్తించి, మొత్తం 68 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.