MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం పంట ఉత్పత్తుల ధరల వివరాలను కార్యదర్శి అశోక్ అహ్మద్ తెలిపారు. వేరుశనగకు గరిష్ఠ ధర రూ. 10,119 కనిష్ఠ ధర రూ.5265 లభించగా, మొక్కజొన్నకు గరిష్ఠ ధర రూ.1854, కనిష్ఠ ధర రూ.1781 లభించింది. పత్తికి గరిష్ఠ ధర రూ.6129 కనిష్ఠ ధర రూ.4029 లభించింది. జొన్నలకు గరిష్ఠ ధర రూ.5230, మినుముల గరిష్ఠ ధర రూ.7,879 ధర లభించింది.
NLG: చిట్యాల, 7వ వార్డు కమ్యూనిటీ హాల్‌లోని వాటర్ ప్లాంట్ సామాగ్రిని నిన్న రాత్రి అక్రమంగా తొలగించారు. ఈ చర్యను నిరసిస్తూ.. మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ లింగస్వామి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. తీసుకొచ్చిన సామాగ్రిని తిరిగి అమర్చి నీటి సౌకర్యాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తూ కమిషనర్‌కు వినతి ఇచ్చారు.
WGL: తపాలా సేవల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి వినియోగదారులు తమ ఫిర్యాదులను మార్చి 9లోగా HYD పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయానికి పంపాలని WGL డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ సూచించారు. మార్చి 25న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 53వ ప్రాంతీయ డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
AP: క్రికెట్ మ్యాచ్‌లో జస్ట్ అలా పడిపోతేనే రెండుచోట్ల ఎముకలు విరిగాయన్న ఐపీఎస్ సునీల్ కుమార్ ట్వీట్‌కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు. ‘అరగంట టైమ్ ఇస్తే నన్ను కొట్టినట్లు నిన్ను కొడతా. ఆ తర్వాత డాక్టర్ రిపోర్టులో ఏం వస్తుందో చూద్దాం. సునీల్‌కు కంగారెక్కువైంది. సునీల్ అరెస్ట్ తథ్యం’ అంటూ హెచ్చరించారు.
TG: MLA వెంకటరమణారెడ్డి ఇంట్లో BJLP సమావేశం నిర్వహించారు. MLAలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్ శంకర్, ధన్‌పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా BJLP నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయి. MLA KVRను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వలేదని, ప్రశ్నిస్తే ఎదురుదాడులకు దిగుతున్నారు. కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది’ అని అన్నారు.
ATP: రాయదుర్గం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. సామాజిక పెన్షన్ సాయం కాదని ఓ ఆర్థిక భరోసా అని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పంపిణీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
NZB: డిచ్‌పల్లి మండలంలోని ఎస్బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వ్యాపార, ఉపాధి రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం టైలరింగ్, మగ్గం, బ్యూటీ పార్లర్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు టూల్ కిట్లు పంపిణీ చేశారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను బట్టబయలు చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీపీఐ, బీఆర్ఎస్ మధ్య చిచ్చుపెట్టి, అడ్డదారిలో రాజకీయ లబ్ధి పొందాలని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ చూస్తున్నారని విమర్శించారు.
KMM: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజీవాల్ పై తప్పుడు కేసులు బీజేపీ కుట్రేనని ఆమ్ ఆద్మీ పార్టీ పాలేరు ఇన్‌ఛార్జ్ పసుమర్తి శ్రీనివాస్ అన్నారు. శనివారం నేలకొండపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రివాల్ పై న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చినా బీజేపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఇకనైనా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.
CTR: పుంగనూరు మండలం చండ్ర మాకులపల్లి పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రైతు దేవేంద్ర నాయుడుకి చెందిన నాలుగు మేకలను గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. ఈ ఘటనపై బాధితుడు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఏఎస్సై అశ్వత్ నారాయణ ఇవాళ మధ్యాహ్నం తెలిపారు.
AKP: కోటవురట్ల మండలం కొడవటిపూడి జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం మండల విద్యాశాఖ అధికారి రామారావు తనిఖీ చేశారు. భోజనం కూరలు సాంబారు పరిశీలించారు. భోజనాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు. ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలన్నారు. ఉపాధ్యాయులు ఈ పథకాన్ని పర్యవేక్షించాలని అన్నారు. హెచ్ఎం ప్రతాప్ కుమార్ పాల్గొన్నారు.
VSP: వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం మార్చి 4న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. విశాఖ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల 11 డిమాండ్ల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.
PPM: మన్యం జిల్లాలో శనివారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షకు 191 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్థులు 2,682 మందికి 67 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,575 మందికి 124 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5,257 మంది విద్యార్థులకు 5,066 మంది హాజరు కాగా 191 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.
ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో A.R. SI శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితికా పంత్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించారు. పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రూ.1,57,146 విలువైన చెక్‌ను అందజేశారు. అనంతరం పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
ASR: జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దనే పింఛను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. పాడేరు మండలంలోని మోదాపల్లి గ్రామంలో శనివారం పర్యటించారు. గ్రామంలోని పలువురు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వారి నివాసాల వద్దకే కలెక్టర్ వెళ్లి నేరుగా పింఛన్లను పంపిణీ చేశారు. పెన్షన్ సొమ్ము సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.