»Manipur Violence Army Recovered An Insas Rifle Ammunition Explosive Befor Amit Shah Touched Down In Imphal
Manipur: మణిపూర్‌లో మెరుగుపడని పరిస్థితి.. భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
మణిపూర్ అల్లర్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంఫాల్ చేరుకోవడానికి ముందురోజు భద్రతా బలగాలు, తీవ్రవాదుల కుట్రను విచ్చిన్నం చేశారు.
Manipur: మణిపూర్ అల్లర్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) ఇంఫాల్ చేరుకోవడానికి ముందురోజు భద్రతా బలగాలు, తీవ్రవాదుల కుట్రను విచ్చిన్నం చేశారు. ఆదివారం సాయంత్రం జరిపిన తనిఖీల్లో జవాన్లు ఒక వాహనం నుంచి ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా సైన్యం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇంఫాల్(Imphal) లోని సిటీ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో భద్రతా దళాలపై దాడి చేసే ఉద్దేశ్యంతో వాహనంలో ముగ్గురు వ్యక్తులు తారస పడినట్లు చెప్పారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో నుంచి INSAS రైఫిల్‌తో పాటు 60 కాట్రిడ్జ్‌లు, హ్యాండ్ గ్రెనేడ్, డిటోనేటర్ లభించాయి. మణిపూర్‌లో ఈ విధంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించడం భద్రతా బలగాలకు కొత్త సవాలును సృష్టించింది. స్వాధీనం చేసుకున్న అనేక ఆయుధాలు,పేలుడు పదార్థాలు ప్రభుత్వ, పోలీసుల నుండి దొంగిలించబడ్డాయి. ఆదివారం నాడు ఇంఫాల్ లోయలోని అనేక పోలీస్ స్టేషన్ల నుండి ఒక గుంపు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దోచుకుంది.
ఇంఫాల్ తూర్పు, పశ్చిమ ప్రాంతంలోని మణిపూర్ రైఫిల్స్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలోకి గుంపు దూసుకుపోయింది. అంతే కాకుండా తౌబాల్‌లోని యారిపోక్, నాంగ్పోక్లోని పోలీస్ స్టేషన్ల(police station)ను కూడా టార్గెట్ చేసి చేతికి అందిన వాటిని దోచుకుని పారిపోయారు. యారిపోక్ పోలీస్ స్టేషన్ ఆయుధశాల నుండి కనీసం 56 తుపాకులు దొంగిలించారు. నాంగ్‌పోక్ సెక్మైలో పోలీసు సిబ్బంది నుండి ఐదు తుపాకులు ఎత్తుకెళ్లారు. మే 3న రాష్ట్రంలో హింస ప్రారంభమైనప్పటి నుండి పలు పోలీసు స్టేషన్ల నుంచి దోచుకున్న మొత్తం ఆయుధాల గురించి స్పష్టమైన గణాంకాలు వెల్లడి కాలేదు. మణిపూర్ డిజిపితో పాటు సీఎం ఎన్. బీరెన్ సింగ్ కూడా పోలీసు స్టేషన్లు, ఆయుధశాలల నుండి ఆకతాయిలు దోచుకున్న ఆయుధాలను తిరిగి ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.