తెలంగాణ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ముగ్గురు ముఖ్యమంత్రులు దర్శించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను దగ్గరుండి సీఎం కేసీఆర్ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ విశేషాలను వారికి వివరించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందివ్వగా.. అర్చకులు ప్రత్యేక అశీర్వచనాలు అందించారు.
అంతకుముందు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో కలిసి కేజ్రీవాల్, భగవంత్, పినరయి, మాజీ సీఎం అఖిలేశ్, రాజా అల్పాహార విందు ఆరగించారు. అనంతరం ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రెండు హెలికాప్టర్ లలో యాదాద్రికి బయల్దేరారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరి రాక సందర్భంగా బుధవారం యాదాద్రిలో రోజువారీ పూజా కార్యక్రమాలను రద్దు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం వీరంతా హెలికాప్టర్ లలో నేరుగా ఖమ్మం నగరానికి బయల్దేరారు.
ఆ ఇద్దరు దూరం..
అయితే యాదాద్రి ఆలయ సందర్శనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా దూరంగా ఉన్నారు. యాదాద్రిలోని ప్రెసిడెన్షియల్ సూట్ లోనే పినరయి, రాజా వేచి ఉన్నారు.