»Pm Modi Kcr And Ys Jagan Wishes On Ambedkar Jayanti
Ambedkar Jayanti: మహనీయుడికి.. మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు నివాళి
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి (BR Ambedkar Jayanti 2023) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు… ఆయనను గుర్తు చేసుకున్నారు. తమ తమ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా అంబేడ్కర్ ను కొనియాడుతూ ట్వీట్లు చేశారు.
సమాజంలోని అణగారిన, దోపిడీకి గురవుతున్న వర్గాల సాధికారత కోసం జీవితాన్ని అంకితం చేసిన పూజ్యనీయ బాబా సాహెబ్ కు ఆయన జయంతి సందర్భంగా వేల వందనాలు.. జైభీమ్ అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
समाज के वंचित और शोषित वर्ग के सशक्तिकरण के लिए अपना जीवन समर्पित करने वाले पूज्य बाबासाहेब को उनकी जयंती पर शत-शत नमन। जय भीम! pic.twitter.com/yssVzjMpnL
దేశంలో చివరి వ్యక్తి వరకు న్యాయం, హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి.. సకల సౌకర్యాలను త్యాగం చేసి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు.. ఆయన ఆశయాలు, ఆలోచనలు మనకు మార్గదర్శకం అని అమిత్ షా ట్వీట్ చేశారు.
అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా కేసీఆర్ నివాళులు అర్పించారు. దేశ గమనాన్ని మార్చడంలో భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి సేవలను స్మరించుకున్నారు.
ఏ ప్రయాణమైనా, ఎంత కష్టమైనా సుదీర్ఘమైన చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో సాగితే గమ్యాన్ని చేరుకోవచ్చునని అంబేడ్కర్ నిరూపించారన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తత్వానికి అంబేడ్కర్ జీవితం నిదర్శనం అన్నారు.
దేశం గర్వించదగ్గ మేథావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆథ్యాత్మిక తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత.
భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారితలో చారిత్రక అడుగులు ముందుకేశాం. అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళులు.. అంటూ జగన్ ట్వీట్ చేశారు.
సమాజంలోని అసమానతలను తొలగించడానికి అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ దళితులకు అన్ని విధాలా ప్రాముఖ్యతనిచ్చింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.
అంబేద్కర్ గొప్పదనాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఆలోచనతో అమరావతి లోని దళితులు ఎక్కువగా వున్న శాఖమూరుని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతూ… రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, లైబ్రరీ, పార్కుతో కూడిన అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకు ఆనాడు శ్రీకారం చుట్టాం.
పేద విద్యార్ధులకు విదేశీ విద్య అందించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చాం. ఏ ఊరిలో అభివృద్ధి పనులు చేపట్టినా వాటిని మొదటగా దళితవాడ నుంచి మొదలెట్టే సంప్రదాయాన్ని తెచ్చాం. ఇకముందు కూడా అంబేద్కర్ స్పూర్తితో దళిత సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందంటూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాం. అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
స్వతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాను. సమాజంలో ఆధిపత్య ధోరణులపై అలుపెరుగని పోరాటం చేశారు. వివక్షని రూపుమాపడానికి జీవితాంతం ఓ యుద్ధమే చేశారు. స్వేచ్ఛా, సమానత్వం, పౌరహక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన మానవతామూర్తి అంబేద్కర్ మహాశయుడి ఆశయసాధనకి కృషి చేద్దాం. వివక్ష, పేదరికంలేని సమాజం నిర్మించుదాం. జై భీమ్.. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతం తనకు ఇష్టమని అంబేడ్కర్ కోట్ ను పెట్టిన మంత్రి కేటీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. ప్రపంచంలో అతిపెద్ద దార్శనిక నేత విగ్రహాన్ని తెలంగాణ సీఎం ఆవిష్కరించడం హర్షణీయన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు తదితరులు అంబేడ్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.