»Nitin Gadkari Those Who Do Good Deeds Do Not Deserve Respect
Nitin Gadkari: మంచి పనులు చేసే వారికి గౌరవం దక్కదు
రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారి సంఖ్య ప్రస్తుతం తగ్గిపోతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజుల్లో మంచి పనులు చేసిన వారికి గౌరవం దక్కడం, అవినీతిపరులకు శిక్ష పడటం కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Nitin Gadkari: రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారి సంఖ్య ప్రస్తుతం తగ్గిపోతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. చాలామంది ఈ సిద్ధాంతాలను పట్టించుకోకుండా అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్లలో కలిసిపోవడం జరుగుతుందని గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజుల్లో మంచి పనులు చేసిన వారికి గౌరవం దక్కడం, అవినీతిపరులకు శిక్ష పడటం కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల్లో అభిప్రాయ భేదాలు ఉండటం ఇబ్బంది కాదు. తగిన ఆలోచన లేకపోవడమే అసలు సమస్య. కొందరు తమ సిద్ధాంతాల ఆధారంగా దృఢ నిశ్చయంతో ఉంటారు. అలా విలువలకు కట్టుబడే వారి సంఖ్య తగ్గిపోతోంది.
భావజాలంలో క్షీణత కనిపిస్తోంది. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నాయకులు అప్పటికి అధికారంలో ఉన్న పార్టీతో అనుబంధం కొనసాగించాలని అనుకుంటారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రత్యేకత వల్లే మన పాలనా వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోంది. రాజకీయ నాయకులు వస్తుంటారు..పోతుంటారు. పబ్లిసిటీ, పాపులారిటీ అవసరమే కానీ.. నేతలు తమ నియోజకవర్గాల్లో చేసిన పనే వారికి వన్నె తెస్తుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా తనపై ప్రభావం చూపిన వ్యక్తుల గురించి వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ తర్వాత రక్షణ శాఖ మాజీ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ తీరు తనను ఆకట్టుకుందని గడ్కరీ చెప్పారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వాక్చాతుర్యాన్ని కొనియాడారు. ఇటీవల భారతరత్న గౌరవం పొందిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేశారన్నారు. రానున్న రోజుల్లో మన ప్రజాస్వామ్యం ఇంకా బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.