కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ (Justice PV Kunhikrishnan) ఓ కేసు విచారణలో కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు పక్కన తన ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్న వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వాదనలు విన్న తర్వాత ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి (Judge) మంచి సలహా ఇచ్చారు. పిల్లలను ఆటలు ఆడుకునే విధంగాప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. స్కూల్‌కి వేళ్లి అలిసిపోయి పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి కమ్మగా వండి పెట్టండని తల్లులకు న్యాయమూర్తి సూచించారు. . తల్లి చేతి వంటలోని కమ్మదాన్ని పిల్లలు ఆస్వాదించేలా చూడాలని చెప్పారు. అంతేకానీ వారికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి స్విగ్గీలు, జొమాటో(Zomato)లలో ఆర్డర్ పెట్టుకునేలా ప్రోత్సహించవద్దని చెప్పారు.
మైనర్ల చేతికి సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ (Mobile phone) ఇవ్వొద్దని, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే తరచూ గమనిస్తూ ఉండాలని తెలిపారు. సరైన పర్యవేక్షణ లేకుంటే పిల్లల చేతుల్లోని స్మార్ట్ ఫోన్ తో అనర్థాలు తప్పవని హెచ్చరించారు. అశ్లీల వీడియోలు, ఫొటోలు (Photos) ఇతరులకు పంపించడం, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం నేరమేనని న్యాయమూర్తి చెప్పారు. అయితే, ఈ కేసులో సదరు వ్యక్తి తన ఫోన్ లో ప్రైవేటుగా పోర్న్ చూస్తున్నారే తప్ప ఇతరులకు పంపడం కానీ, ప్రదర్శించడం కానీ చేయలేదని అన్నారు. ఓ వ్యక్తి ప్రైవేటుగా అశ్లీల వీడియోలు చూడడం ఐపీసీ సెక్షన్ (IPC Sec) 292 కిందికి రాదని, దానిని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. పోలీసులు పెట్టిన ఈ కేసును జడ్జి కొట్టేశారు.