ఉత్తరప్రదేశ్ (UP) రాష్ట్రం అమేఠీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) ఓ విలేకరి (Journalist)పై ఆమె మండిపడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆమెను మీడియా చుట్టుముట్టి ప్రశ్నలు అడిగారు. అయితే, ఆ సమయంలో ఓ రిపోర్టర్ పై ఆమె మండిపడ్డారు. తన నియోజకవర్గ ప్రజలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో (Viral Video) ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన నియోజకవర్గ ప్రజలను అవమానిస్తేతాను ఊరుకోనని ఆమె అన్నారు.దీన్ని తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన కాంగ్రెస్ (Congress).. కేంద్రమంత్రిపై విమర్శలు గుప్పించింది.
ఈ వీడియోను కాంగ్రెస్ (Congress) పోస్ట్ చేస్తూ.. ‘‘స్మృతి ఇరానీజీ విలేకరులను బెదిరిస్తున్నారు. వారి ఉద్యోగాలను ఊడగొట్టాలని చూస్తున్నారు. ఇక నుంచి జర్నలిస్టులు కేవలం చక్కెర రూ.13కు ఎప్పుడు వస్తుంది? గ్యాస్ సిలిండర్ ధర ఎప్పుడు తగ్గుతుంది? అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలపై మౌనం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలే అడగాలేమో..! సమాధానం చెప్పలేని ప్రశ్నలడిగితే.. ఆమె కారు దిగి బెదిరిస్తారు. స్మృతిజీ మీరో విషయం అర్థం చేసుకోవాలి. ఇది ప్రేమ కాదు’’ అని కేంద్రమంత్రిపై విమర్శలు గుప్పించింది.అయితే కాంగ్రెస్ విమర్శలకు స్మృతి ఇరానీ (Smriti Irani) కూడా గట్టిగానే బదులిచ్చారు.
‘‘అమేఠీ (Amethi) ప్రజలతో తప్పుగా ప్రవర్తించొద్దనే నేను చెప్పాను. అది అభ్యర్థన అని మీకు (కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ) అర్థం కాకపోవచ్చు. అమేఠీ ప్రజలను అవమానిస్తే మీరు భరించగలరేమో గానీ.. నేను కాదు. ఇక ప్రశ్నల గురించి అంటారా? చెప్పండి దీని గురించి మాజీ ఎంపీ (రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఉద్దేశిస్తూ)తో ఎప్పుడు డిబేట్కు దిగాలి. అప్పుడే చక్కెర, పిండి, పప్పుల ధరలు కూడా చెబుతాను’’ అని కేంద్రమంత్రి హస్తానికి కౌంటర్ ఇచ్చారు.