»Chandrayaan 4 Another Isro Mission To The Moon For Traces Of Water
ISRO: నీటి జాడ కోసం చంద్రయాన్-4..జాబిల్లిపైకి మరో ఇస్రో మిషన్!
చంద్రునిపై నీటి జాడను గుర్తించి ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో మరో ప్రయోగం చేయనుంది. చంద్రయాన్-4 మిషన్‌ను జపాన్ శాస్త్రవేత్తలతో కలిసి చేపట్టేందుకు సిద్ధమైంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ప్రపంచంలో ఏ దేశం సాధించలేని ప్రయోగాన్ని భారత్ (India) సాధించింది. చంద్రుని (Moon) దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 (Chandrayan-3) ప్రయోగం చేపట్టి భారత్ విజయం సాధించన సంగతి తెలిసిందే. ఇస్రో (ISRO) సైంటిస్టుల కృషి ఫలితంగా జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) సందడి చేసింది. రెండు వారాల పాటు చంద్రునిపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు పలు పరిశోధనలు చేసి ఇస్రోకు సమాచారం అందించాయి. ప్రస్తుతం అవి నిద్రాణ స్థితిలో ఉన్నాయి.
చంద్రునిపై ఉండే ఉష్ణోగ్రతలను (Temperature) తట్టుకుని ల్యాండర్, రోవర్లు మనుగడ సాగించడం కొంత అసాధ్యమైన పని. దీంతో చంద్రయాన్-3 మిషన్ దాదాపు ముగిసినట్టేనని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇప్పటికే ఈ మిషన్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని అంచనాలకు మించి పనిచేసింది. ఇదే ఉత్సాహంతో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో సమాయత్తమైంది.
చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 (Chandrayan-4) ప్రయోగాన్ని భారత్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే జపాన్ (Japan) అంతరిక్ష పరిశోధన సంస్థ (Jaxa)తో కలిసి ఈ మిషన్‌ను భారత్ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు చంద్రయాన్-4 లేదా ల్యూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్ (LUPEX) అనే పేరును పెట్టే అవకాశం ఉంది. జపాన్‌కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని రెండు దేశాలు కలిసి చేపట్టనున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన అనేది ఇంకా రావాల్సి ఉంది.
ఈ మిషన్‌కు సంబంధించి 2017లోనే భారత్, జపాన్‌లు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రయాన్3 తర్వాత ఈ మిషన్ చేపట్టేందుకు అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలంపై నీటి (Water) ఉనికిని కనుగొనేందుకు ఈ ప్రయోగం ఎంతగానో తోడ్పడనుంది. ఇది సక్సెస్ అయితే భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు మద్దతుగా నిలవడమే కాకుండా చంద్రునికి సంబంధించిన మరిన్ని రహస్యాలను కూడా తెలుసుకునేందుకు వీలవుతుంది. ఈ ప్రయోగం 2026లో చేపట్టే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే Isro, Jaxa వివరాలను వెల్లడించనుంది.