»Covid New Variant 2 More New Variants Of Covid There Are Huge Number Of Cases Registered
Covid New Variant: కొవిడ్‌లో మరో 2 కొత్త వేరియంట్లు..అక్కడ భారీగా కేసులు నమోదు
తగ్గాయనుకున్న కరోనా కేసులు మళ్లీ కోన్ని దేశాల్లో పెరుగుతున్నాయి. సింగపూర్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు వచ్చాయి. ఈ కొత్త వేరియంట్ల కేసుల సంఖ్య 2000కు పైగా చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కరోనా కేసులు (Corona Cases) తగ్గాయనుకున్న తరుణంలో మరోసారి అవి తమ రూపాన్ని మార్చుకుని విజృంభిస్తున్నాయి. తాజాగా మరో రెండు కొత్త వేరియంట్లు (2 New Variants) వెలుగుచూశాయి. కేసులు గణనీయంగా తగ్గుతున్నప్పటికీ పలు దేశాల్లో మాత్రం ప్రమాదకరంగానే ఉన్నాయి. ఈ మధ్యనే అమెరికా (America), యూకే (UK) సహా పలు దేశాల్లో ఈ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ల కేసులతో పాటుగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య పెరిగినట్లుగా పలు నివేదికలు వెల్లడించాయి.
సింగపూర్ (Singapur)లో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్రమైన సమస్యలు లేకపోయినా రెండు కొత్త వేరియంట్ల వల్ల కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్ కేసుల సంఖ్య 2000 మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో రోగుల సంఖ్యకు కూడా పెరగడంతో ఆరోగ్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. పౌరులందరూ తప్పనిసరిగా కొవిడ్ నియమాలను (Covid Rules) పాటించాలని ఆరోగ్యశాఖ సూచించింది.
EG.5 వేరియంట్‌తో పాటుగా దాని సబ్ వేరియంట్ అయిన HK.3 వల్ల చాలా మంది అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రెండు కూడా ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ సబ్ వేరియంట్లు అని, ఈ మధ్యకాలంలో 75 శాతం కేసులు పెరుగడానికి ఇవే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్ ఉధృతి ఎక్కువగా ఉందని, రాబోయే రోజుల్లో ఇది మరింతగా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఊరట కలిగించే విషయమేంటంటే ఈ రెండు వేరియంట్ల వల్ల అంత ప్రమాదమేమీ ఉండదని, ఈ వేరియంట్ల స్వభావాన్ని అధ్యయనం చేస్తున్నట్లు సింగపూర్ పరిశోధకులు తెలిపారు. గతంలో థాయ్‌లాండ్ లోనూ ఈ వేరియంట్ల కేసులు నమోదయ్యాయని, అయితే అక్కడ మాత్రం కేసులు పెరిగినట్లుగా కనిపించడం లేదని గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులు సింగపూర్‌లో పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.