పాలస్థీనా ఉగ్రసంస్థ హమాస్ దాడులతో ఇబ్బందుల్లో పడ్డ తన చిరకాల మిత్రదేశానికి అండగా అమెరికా (America) రంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతానికి విమాన వాహక నౌకను పంపాలని అమెరికా నిర్ణయించింది. ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అక్కడికి వెళ్లాలని పెంటగాన్ (Pentagon)ఆదేశించినట్లు ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించారు. 5వేల నావికులు, యుద్ధ విమానాలతో కూడిన ద యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వాహక నౌకను, క్రూజ్లను, డిస్ట్రాయర్స్‌ను పంపనున్నట్లు వెల్లడించారు.
ఇది ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడంతోపాటు హమాస్‌కు అదనపు ఆయుధాలను సమకూర్చే వారిపై నిఘా ఉంచనుంది. వర్జీనియా (Virginia) కేంద్రంగా ఉండే ఈ విమాన వాహక నౌక ప్రస్తుతం మధ్యధరా సముద్ర ప్రాంతంలోనే ఉంది. నౌకా విన్యాసాల కోసం ఈ ప్రాంతానికి వచ్చింది. ఈ గ్రూప్‌లో క్రూజ్ యూఎస్ఎస్ నార్మండీ, డిస్ట్రాయర్లు యూఎస్ఎస్ థామస్ హడ్నర్, యూఎస్ఎస్ రాంపేజ్, యూఎస్ఎస్ క్యార్నీ, యూఎస్ఎస్ రూజ్‌వెల్ట్‌తోపాటు ఎఫ్-35, ఎఫ్-15, ఎఫ్-16, ఏ-10 యుద్ధ విమానాలు ఉంటాయి.
ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామంటూ అంతకుమునుపే అమెరికా విస్పష్ట ప్రకటన చేసింది. ఆ తరువాత కొద్ది సేపటికే తన ఆయుధ సంపత్తిని రంగంలోకి దించింది. అంతేకాకుండా, ఈ యుద్ధంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఇతర దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు, హమాస్-ఇజ్రాయెల్ (Israel)యుద్ధం వెనుక రష్యా పాత్ర ఉన్నట్టు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. హమాస్‌కు ఇరాన్ మద్దతు ఇవ్వడం వెనుక రష్యా (Russia) హస్తం, సహకారం ఉందన్న సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు.