»Afghanistan Earthquake Latest News Almost 2000 People Killed Says Taliban Spokesman
Afghanistan Earthquake: శవాల దిబ్బగా మారిన ఆఫ్ఘనిస్తాన్.. ఇప్పటివరకు 2000 మందికి పైగా మృతి
భూకంపం వల్ల సుమారు 6 గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయని.. వందలాది మంది పౌరులు శిథిలాల కింద సమాధి అయ్యారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 465 ఇళ్లు నేలమట్టమయ్యాయని, 135 పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు.
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో శనివారం సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. భూకంపం కారణంగా దేశంలో ఇప్పటివరకు 2000 మందికి పైగా మరణించారని తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. రెండు దశాబ్దాల్లో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో తాజా భూకంపం ఒకటి. ఇప్పటికీ ఇంకా శిథిలాల కింద ఇంకా వేలాది మంది చిక్కుకుపోయారు. తక్షణ సాయం కోసం దేశ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రేయాన్ ప్రార్థిస్తున్నారు. భూకంపం వల్ల సుమారు 6 గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయని.. వందలాది మంది పౌరులు శిథిలాల కింద సమాధి అయ్యారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 465 ఇళ్లు నేలమట్టమయ్యాయని, 135 పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు.
దేశంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటికి బాధితుల కోసం సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. హెరాత్ ప్రావిన్స్‌లోని జెండా జాన్ జిల్లాలో నాలుగు గ్రామాలు భూకంపం వల్ల ఎక్కువగా దెబ్బతిన్నాయని విపత్తు అథారిటీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్లా జాన్ తెలిపారు. హెరాత్ నగరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది. 30నిమిషాల్లో 5అత్యంత తీవ్రమైన కంపనాలు వచ్చినట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడానికి అంబులెన్స్ కార్లను జెండా జాన్‌కు పంపినట్లు తెలిపింది.
భూకంప ప్రభావిత ప్రాంతాలకు వీలైనంత త్వరగా చేరుకోవాలని, తద్వారా క్షతగాత్రులను ఆదుకోవాలని తాలిబాన్ స్థానిక సంస్థలకు విజ్ఞప్తి చేసింది. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి బతికిన వారికి ఆహారం అందించాలని వేడుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు భద్రతా సంస్థలు తమ వనరులను, సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరింది.