Char Dham yatra: షాకింగ్..చార్ధామ్ యాత్రలో 200 మంది యాత్రికులు మృతి!
ఈ ఏడాదిలో చార్ధామ్ యాత్రకు సుమారుగా 42 లక్షల మంది వెళ్లారు. అయితే అనారోగ్య సమస్యలు రావడం, బండరాళ్లు పడటంతో సుమారు 200 మంది వరకూ మరణించినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ చార్ధామ్ యాత్ర (Char Dham yatra) చేసిన వారిలో 200 మంది యాత్రికులు మృతిచెందినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. యాత్రలో అనారోగ్య సమస్యలు రావడం, బండరాళ్లు పడటం వంటి ఘటనల వల్ల యాత్రికులు మరణించినట్లు తెలిపింది. ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ గణాంకాల ప్రకారంగా కేదార్నాథ్ ధామ్ మార్గంలో అత్యధికంగా 96 మరణాలు సంభించాయి.
ఇకపోతే యమునోత్రి ధామ్‌లో 34 మంది, బద్రీనాథ్ ధామ్‌లో 33 మంది, గంగోత్రి ధామ్‌లో 29 మంది, హేమకుండ్ సాహిబ్‌లో ఏడుగురు, గౌముఖ్ ట్రెక్‌లో ఒకరు మృతిచెందినట్లు ఉత్తరాఖండ్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చార్ధామ్ యాత్రకు సుమారు 42 లక్షల మంది వరకూ వెళ్లారు. అందులో ప్రధానంగా కేదార్నాథ్ ధామ్‌ను 13.4 లక్షల మంది యాత్రికులు దర్శించుకున్నారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వ గణాంకాల ప్రకారంగా గత ఏడాది సెప్టెంబర్ 11 వరకు 232 మంది యాత్రికులు చనిపోయారు. ఆ ఏడాదిలో కేదార్నాథ్ ధామ్‌లో 111 మంది, బద్రీనాథ్ ధామ్‌లో 58 మంది, హేమకుండ్ సాహిబ్‌లో నలుగురు, గంగోత్రి ధామ్‌లో 15 మంది, యమునోత్రి ధామ్‌లో 44 మంది మృతిచెందారు. గత ఏడాదిలో యాత్ర పూర్తయ్యేటప్పటికి మొత్తం 300కుపైగా యాత్రికులు చనిపోయినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.