RGV tweet: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం వ్యూహం. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చేసింది. విడుదలపై సస్పెన్స్ వీడిపోయింది. వరుస వాయిదాలతో విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రానుంది. కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో మార్చి 2న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యూహం విడుదల విషయాన్ని తెలియజేస్తూ రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను చూపిస్తూ.. పట్టు వదలని విక్రమార్కుడిని అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మార్చి 2న వ్యూహం సినిమా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఏపీ రాజకీయాల చుట్టూ తిరిగే ఈ సినిమాను మొదటి నుంచీ వివాదాలు చుట్టుముట్టాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వ్యూహం సినిమాను రాంగోపాల్ వర్మ తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాపై టీడీపీ, జనసేన వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ పొలిటికల్ మైలేజీ కోసం తమ నాయకులను కించపరిచేలా చూపించాడంటూ ఇరు పార్టీలకు చెందిన నేతలు ఆర్జీవీపై మండిపడుతున్నారు. ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టుకెక్కారు. దీంతో గతేడాది డిసెంబర్ 29 న విడుదల కావాల్సిన సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత థియేటర్లలోకి రానుంది. కోర్టు ఆదేశాలతో సినిమా విడుదలను పలుసార్లు వాయిదా వేసిన ఆర్జీవీ.. పట్టు వదలకుండా పోరాటం చేశారు. ఎట్టకేలకు వ్యూహం విడుదలకు అనుమతి తెచ్చుకున్నారు.