నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం వస్తుండడం, ప్రచార చిత్రాలు ఆసక్తిగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
చిత్రం:కృష్ణమ్మ నటీనటులు: సత్యదేవ్, లక్ష్మణ్ మీసాల, కృష్ణ బురుగుల, అర్చన అయ్యర్, అతీరా రాజ్, రఘు కుంచె, నంద గోపాల్, తారక్, సత్యం తదితరులు మ్యూజిక్: కాలభైరవ సినిమాటోగ్రఫి: సన్నీ కూరపాటి నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి సమర్పణ: కొరటాల శివ దర్శకత్వం: వి.వి.గోపాలకృష్ణ విడుదల తేదీ: 10-05-2024
వినుత్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు సత్యదేవ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తుండడంతో చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో పాటు ప్రచార చిత్రాలు, పాటలు సైతం ఆకట్టుకున్నాయి. ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టాలనే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
భద్ర (సత్యదేవ్), శివ (కృష్ణ బూరుగుల), కోటి (లక్ష్మణ్ మీసాల) ముగ్గురి అనాథలు. చిన్ననాటి నుంచి ప్రాణానికి ప్రాణంగా పెరుగుతారు. అయితే చిన్నప్పడే జైలుకు వెళ్లి వచ్చిన శివ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని బతుకుతుంటాడు. ఇక భద్ర, కోటి గంజాయి స్మగ్లింగ్ చేయడమే జీవనోపాదిగా పెట్టుకుంటారు. వీరు అనాథలు కావడంతో తమకంటూ ఓ కుటుంబం ఉండాలని కలగంటారు. ఆ సమయంలోనే శివ మీనా (అతీరా రాజ్)తో లవ్‌లో పడతాడు. భద్ర మీనాను సొంత అన్నలా చూసుకుంటాడు. ఇక గంజాయి మానేసి ఆటో నడుపుకుంటూ మంచిగా బతకాలని ప్రయత్నం చేస్తాడు భద్ర. ఈ క్రమంలో మీనా తల్లి ఆపరేషన్‌కు రూ.2లక్షలు అవసరమవుతాయి. ఎక్కడ డబ్బు దొరకపోవడంతో చివరి సారి గంజాయి స్మగ్లింగ్ చేద్దామని ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు. అలా గంజాయి తరలించే సమయంలో పోలీసులకు పట్టుబడుతారు. అదే సమయంలో ఓ యువతి హత్యాచారం కేసులో ఇరుక్కుంటారు. ఆ తరువాత ఏమైంది? అత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు? ఈ ముగ్గురి ఆ కేసునుంచి బయట పడుతారా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
ఇదొక భావేద్వేగాలతో కూడిన ప్రతీకార కథ. రా అండ్ రస్టిక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథలో మెయిన్ పాయింట్‌ను చెప్పడానికి ప్రథమార్థమంతా సాగతీతగా ఉంటుంది. కాకపోతే సినిమా ఆరంభంలో అడవిలో జరిగే ఒక హత్యతో సత్యేదవ్ను రివీల్ చేసే సన్నివేశంతో చాలా బాగుంటుంది. అలా ఈ ముగ్గురు స్నేహితుల గతం చెబుతూ కథ నెమ్మదిగా సాగుతుంది. మీనాతో శివ ప్రేమలో పడటం, చిన్న చిన్న గొడవలతో కథగా సాగుతుంది. అలా ఇంటర్వెల్ సమయంలో గంజాయితో పట్టుబడడం, అమ్మాయి హత్యాచార కేసులో ఇరుక్కుపోవడంతో అసలు కథ మొదలౌతుంది.
తరువాత సెకండ్ ఆఫ్ అంతా సీరియస్ టోన్‌లో సాగిపోతుంది. రేప్‌కు గురైన యువతి ఎవరో తెలిశాక భద్ర, కోటి, శివ పోలీసులపై తిరగబడే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇన్విస్టిగేషన్ పేరుతో వాళ్లను చిత్రహింసలు పెట్టే సీన్లు జైభీమ్, విచారణ చిత్రాలను తలపిస్తాయి. ఇక భద్ర, కోటి జైలు నుంచి బయటకు వచ్చి వరుస హత్యలు చేసే సీన్లు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు ఎమోషనల్‌గా అనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే:
భద్ర పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా చేశాడు. ఇంటెన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన కనబరిచే కోపం, ప్రతీకారం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ద్వితీయార్థంలో ఆయన పలికించే భావోద్వేగాలు కదలిస్తాయి. అలాగే క్లైమాక్స్‌లో ఆయన నటన పీక్స్‌లో ఉంటుంది. మిత్రులుగా నటించిన లక్ష్మణ్, కృష్ణ సహజమైన నటనతో మెప్పించారు. అలాగే మీనా పాత్రలో అతీరా బాగా నటించింది. ఇక సినిమాలోని మిగతా పాత్రలన్నీ ఫర్వాలేదనిపిస్తాయి.
సాంకేతిక అంశాలు:
దర్శకుడు గోపాలకృష్ణ టేకింగ్‌లో మెప్పించారు. రా అండ్ రస్టిక్‌గా చూపించిన తీరు మెప్పిస్తుంది. కాలభైరవ నేపథ్య సంగీతం సినిమాకి
ప్రధాన బలం. సినిమాటోగ్రఫి బాగుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి. అలాగే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.