ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె కుటుంబంలో విషాదం నెలకొంది. రఘు తండ్రి కుంచె లక్ష్మీనారాయణ రావు (90) మంగళవారం కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన లక్ష్మీనారాయణరావు హోమియో వైద్యుడు. స్థానిక సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. లక్ష్మీనారాయణ రావుకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరిగిన మరుసటి రోజే ఆయన మరణించడంతో కుంచె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అంత్యక్రియలు బుధవారం స్వగ్రామం గాదరాడలో జరిగాయి.
రఘు కుంచె తెలుగు సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించాడు. సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా రఘు రాణించాడు. చాలా సినిమాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించాడు. రఘు సంగీతం అందించిన ‘1978 పలాస’ సినిమాలోని ‘నాదీ నెక్లెస్ గొలుసు’ పాట 2020లో టాప్ ట్రెండ్ లో ఉన్న విషయం తెలిసిందే. రఘు మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తాడు. కళ ఎక్కడుంటే అక్కడ వాలిపోయి కొత్త వారికి అవకాశాలు కల్పిస్తుంటాడు. బేబీ, అసిరయ్య వంటి ఎంతో మందికి రఘు జీవితాన్నిచ్చాడు.