రామ్ చరణ్, ఉపాసన (Upasana) దంపతులు ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ పాపకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన అందరికీ ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. ‘మా చిన్నారికి ఆత్మీయ స్వాగతం పలికిన మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు’ అంటూ పాపతో దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తొలిసారి తండ్రయిన ఆనందాన్ని అనుభవిస్తుండగా, మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నారు.
జూన్ 20న ఉపాసన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రి(Apollo Hospital)లో పండంటి అమ్మాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఉపాసన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రామ్ చరణ్, ఉపాసన 2012లో పెళ్లితో ఒక్కటి కాగా, ఇన్నాళ్లకు మెగా ఇంట మూడో తరం అడుగుపెట్టింది. దాంతో చిరంజీవి (Chiranjeevi) కుటుంబ సభ్యుల్లోనూ, మెగా అభిమానుల్లోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా తమ నివాసంలో కుమార్తెను పొదివిపట్టుకుని ఉన్న ఫొటోను కూడా ఉపాసన పంచుకున్నారు. ఇందులో రామ్ చరణ్ తమ పూడిల్ జాతి పెంపుడుకుక్కను ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తుండడం చూడొచ్చు.