సినిమా నేపథ్యంలోనే గాడ్ ఫాదర్ మూవీలో డైలాగ్స్ ఉన్నాయని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. అంతేగాని రాజకీయ నాయకులను ఉద్దేశించి రాసుకున్నవి కాదన్నారు. కావాలని సెటైర్లు వేయలేదని.. స్టోరీని బట్టి రాసుకున్నవి మాత్రమేనని వెల్లడించారు. వీటిపై ఎవరైనా బుజాలు తడుముకుంటే తాను ఏం చేయలేనని తాజా ప్రెస్ మీట్లో భాగంగా పేర్కొన్నారు.
”నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు”. ఈ డైలాగ్ సీనిమా నేపథ్యంలోనే ట్వీట్ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో తన మద్దతు తమ్ముడు పవన్ కల్యాణ్ కు ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంకితభావం కల్గిన నాయకుడు అవసరమని అన్నారు. లూసీఫర్ చిత్రానికి తాను పెద్ద అభిమానినని మెగాస్టార్ పేర్కొన్నారు. డైరెక్టర్ మోహన్ రాజా చేసిన మార్పుల ఆధారంగా తాను సంతృప్తి చెందినట్లు చెప్పిన చిరు…ఈ మూవీలో సాంగ్స్ లేవనే ఆలోచన రాదన్నారు.
అంతేకాదు తాను ఇలాంటి స్థితిలో ఉండటానికి కారణం ప్రతి ఒక్క టెక్నిషన్ సహా అనేక మంది కృషి వల్లే సాధ్యమైందని చిరంజీవి అన్నారు. ఒక శిల్పం అందంగా తయారైందంటే…అది దాని గొప్పతనం కాదన్నారు. ఆ శిలను తీసుకొచ్చిన వ్యక్తి, చెక్కిన శిల్పి పాత్ర ఎంతో ఉందన్నారు. ఇదే సూత్రం తనకు కూడా వర్తిస్తుందని వెల్లడించారు. ఒకే తరహా సినిమాలు చేసి.. కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నప్పుడే ఈ సినిమా స్టోరీ గురించి రామ్ చరణ్ చెప్పారని పేర్కొన్నారు.