బ్యాక్ టు బ్యాక్ త్రివిక్రమ్, రాజమౌళితో సినిమాలు చేయబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అందుకే వాళ్ల కోసం భారీగా రిస్క్ చేయబోతున్నాడట. అయితే రాజమౌళితో రిస్క్ చేయాలంటే ముందుగా త్రివిక్రమ్‌తో కలిసి స్టంట్స్ చేయాల్సి ఉంది మహేష్. మహేష్ కెరీర్లో 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. రేపో మాపో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న, ఎస్ఎస్ఎంబీ28ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ను యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు పెట్టబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
అందుకోసం భారీ సెట్ వేశారని కూడా టాక్. అయితే స్టార్టింగ్‌లోనే మహేష్ ఈ సినిమా కోసం రిస్కీ స్టంట్స్ చేయడం వెనక పెద్ద చర్చే జరుగుతోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళి ప్రాజెక్ట్ మొదలు పెట్టనున్నాడు మహేష్. ప్రస్తుతం జక్కన్న స్క్రిప్టు ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఈ లోపు త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది మహేష్. అందుకే ముందుగా యాక్షన్ షెడ్యూల్స్ పూర్తయ్యోలా ప్లాన్ చేయమని.. మాటల మాంత్రికుడికి చెప్పాడట మహేష్. ఆ తర్వాత మిగతా డైలాగ్ పార్ట్, సాంగ్స్ కంప్లీట్ చేయనున్నారట. ఇలా చేయడం వల్ల కాస్త ముందుగానే రాజమౌళితో రంగంలోకి దిగాలని చూస్తున్నాడట మహేష్. ఎందుకంటే ఒక్కసారి జక్కన్నతో కమిట్ అయితే రెండు, మూడేళ్లు లాక్ కావాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా త్రివిక్రమ్ సినిమా ఫినిష్ చేసే ఆలోచనలో మహేష్ ఉన్నాడని చెప్పొచ్చు.