కెజియఫ్ తర్వాత అదే స్థాయిలో దుమ్ముదులుపోతోంది ‘కాంతార'(Kantara) అనే మరో కన్నడ సినిమా. అసలు ఇందులో హీరో మొహం కూడా మన తెలుగు ఆడియెన్స్‌కు పరిచయం లేదు. కానీ కంటెంట్‌తో కొట్టడంతో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది కాంతార. దసరా కానుకగా రిలీజ్ అయిన మెగాస్టార్ గాడ్ ఫాదర్ (godfather) భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లో భారీ వసూళ్లతో గర్జిస్తునే ఉన్నాడు గాడ్ ఫాదర్. అయినా ముఖ పరిచయం లేని ఓ హీరో సినిమా కోసం.. జనాలు థియేటర్‌కు పరుగులు తీయడం విశేషం.
అది కూడా మెగాస్టార్ సినిమా రేసులో ఉండగా.. అంటే మామూలు విషయం కాదు. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార సినిమా.. సెప్టెంబర్ 30న, పొన్నియన్ సెల్వన్‌తో పాటే కన్నడలో రిలీజ్ అయింది. పీఎస్-1 సంగతి పక్కన పెడితే.. కాంతార మాత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే కన్నడ వెర్షన్ వంద కోట్ల కలెక్షన్స్ సాధించి.. అక్కడ ఆరో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా రికార్డ్ సృష్టించింది. దాంతో తెలుగులో అక్టోబర్ 15న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ ఈ సినిమాను రిలీజ్ చేసింది.
ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది కాంతార. ఓ పక్క మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ థియేటర్లో రన్ అవుతున్నప్పటికీ.. కాంతార క్రేజ్ చూసి షాక్ అవుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మొదటి రోజే తెలుగు వెర్షన్ 5 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ఇప్పటికే చెప్పుకున్నాం. ఇక రెండో రోజు అంతకు మించి అనేలా కలెక్షన్లు రాబట్టింది కాంతార. మొత్తంగా రెండు రోజుల్లో 11 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్టు ట్రేడ్ వర్గాల టాక్. దాంతో లాంగ్ రన్లో ఇక్కడ కాంతార భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తంగా గీతా ఆర్ట్స్‌కు డబుల్ ఫ్రాపిట్ రావడం ఖాయమని చెప్పొచ్చు.